
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది.రాబోయే రోజుల్లో బీసీవిద్యార్థుల కోసం 10 ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నామని మంత్రి సవిత తెలిపారు. ఇదే సమయంలో ఆరుగు బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. ముఖ ఆధారిత హాజరుతో బీసీ హాస్టళ్లలో డైట్ బిల్లు మంజూరులో నకిలీ క్లెయిమ్ లను నియంత్రించామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 10 ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నామని, ఆరు బీసీ గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామని వెల్లడించారు. అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చాలా దారుణ పరిస్థితులు నెలకున్నాయని, కనీసం మరమ్మతులైన కుళాయిలను కూడా మార్చలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వపు డైట్ బకాయిల చెల్లింపుతో పాటు బీసీ హాస్టళ్లలో మరమ్మతులు చేపట్టామని వివరించారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగి ప్రశ్నలకు మంత్రి సవిత జవాబిచ్చారు. 891 బీసీ వసతి గృహాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు రూ.20 కోట్లతో యూపీఎస్ లు/ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 814 హాస్టళ్లలో రూ.16.85 కోట్లతో ఈ ఏడాది మే నాటికి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు పూర్తి చేస్తామని తెలిపారు. జల మిత్ర యాప్ ద్వారా ప్రతి 15 రోజులకొకసారి హాస్టళ్లలో నీటి నమూనాలను పరీక్షించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పౌర సౌకర్యాలు మెరుగుపరచడంలో భాగంగా 397 బీసీ హాస్టళ్లలో చిన్న చిన్న మరమ్మతులు చేశామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రూ.14.56 కోట్లతో బీసీ హాస్టళ్లలో 971 మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని, ఈ ఏడాది జూన్ నాటికి వాటిని నిర్మాణాలు పూర్తి చేస్తామని సభకు వెల్లడించారు. హాస్టళ్లలో మెనూ, పరిశుభ్రత, పారిశుధ్యం పర్యవేక్షణకు ఆరోగ్య సేవా మాడ్యూల్ ప్రారంభించామని, హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాలకు వంట పాత్రలు, ఇతర సామాగ్రి సరఫరా చేశామన్నారు.