ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే దేశానికి చేరాలని కేంద్రం పిలుపు

పయనించే సూర్యుడు న్యూస్ : అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇరాన్ లోని భారతీయులకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ఇరాన్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు లేదా ఇతర ప్రయాణ మార్గాల ద్వారా ఆ దేశాన్ని విడిచిపెట్టి స్వదేశానికి తిరిగి రావాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది. ఇరాన్ ప్రభుత్వంపై సొంత పౌరుల నుంచి వ్యతిరేకత వస్తుండటం, దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు జరుగుతుండటంతో పరిస్థితి అదుపు తప్పింది. దీనికి తోడుగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సైనిక లేదా అణు దాడి చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సాయుధ దళాలు ఇప్పటికే మధ్యప్రాచ్యంలో భారీ స్థాయిలో సైనిక మోహరింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరాన్ సైతం ఏ దాడి జరిగినా దీటుగా బదులిస్తామని, ప్రతీకార దాడులకు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పింది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎవరూ ఇరాన్ పర్యటనకు వెళ్లవద్దని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాన్ దేశంలో ప్రస్తుతం సుమారు పది వేల మంది భారతీయులు ఉన్నట్లు అధికారిక వర్గాల అంచనా. వీరిలో అత్యధికంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులే ఉన్నారు. తాజా భద్రతా పరిస్థితుల దృష్ట్యా వీరంతా తమ పాస్ పోర్టులు, ఇమ్మిగ్రేషన్ పత్రాలను ఎల్లవేళలా తమ వద్దనే భద్రంగా ఉంచుకోవాలని టెహ్రాన్ నగరంలోని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణమే ఎంబసీ అధికారులను సంప్రదించడానికి వీలుగా పలు హెల్ప్ లైన్ నంబర్లను సైతం అందుబాటులోకి తెచ్చింది. స్థానికంగా జరిగే నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరిగే ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని ప్రవాస భారతీయులను కోరింది. ఇంకా వివరాలు నమోదు చేసుకోని వారు వెంటనే ఎంబసీ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. అమెరికా తన యుద్ధ విమాన వాహక నౌకలను గల్ఫ్ ప్రాంతానికి పంపించి ఇరాన్ పాలకులకు గట్టి సంకేతాలు పంపుతోంది. అణు కార్యక్రమంపై జెనీవాలో జరుగుతున్న చర్చలు సఫలం కాకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్ అగ్రనేతలను మట్టుబెట్టేందుకు సైతం పెంటగాన్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నప్పటికీ యుద్ధ వాతావరణం ఏమాత్రం చల్లబడలేదు. అటు ఇజ్రాయెల్ సైతం పరిస్థితులను నిశితంగా గమనిస్తూ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. తమ స్థావరాలపై దాడులకు దిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్లు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అణుదాడి జరిగినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు దేశీయంగా చెలరేగిన అల్లర్లను అణచివేసే క్రమంలో ఇరాన్ భద్రతా దళాలు అనుసరిస్తున్న కఠిన చర్యలపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పశ్చిమ ఆసియాలో శాంతి భద్రతలు మరింత దిగజారాయి. యుద్ధం జరిగితే గ్లోబల్ ఆయిల్ మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉంది.