
సాక్షి డిజిటల్ న్యూస్ :జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో “ఏఐ కౌన్సిల్”ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో “ఏఐ కౌన్సిల్”ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు చట్టపరమైన రక్షణ చర్యలు రూపొందించే ప్రత్యేక “ఏఐ మంత్రిత్వ శాఖ”ను ఏర్పాటు చేయాలని అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా - ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం సహకారంతో దేశానికి ఒక ఏఐ స్టార్టప్ విలేజ్‌ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏఐలో శరవేగంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి నిరంతరం అభివృద్ధిని పర్యవేక్షించే జాతీయ ఏఐ వార్‌రూమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం అనుమతిస్తే అందుకు హైదరాబాద్ కేంద్రంగా వార్‌రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏఐ పురోగతిలో తెలంగాణతో భాగస్వామ్యం కావాలని సదస్సు ద్వారా ప్రపంచ నాయకులు, సాంకేతిక నిపుణులకు ఈ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. సామాజిక న్యాయ సాధనకు, పేదరిక నిర్మూలనకు ఏఐను శక్తివంతమైన సాధనంగా వినియోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో ఏఐకి సంబంధించి ప్రతి ఏటా ఒక్కసారి జరిగే చర్చలు సరిపోవని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలోని వివిధ నగరాలలో సంవత్సరానికి రెండుసార్లు ఏఐ సమ్మిట్లు నిర్వహించాలని ప్రతిపాదించారు. జీపీయూ చిప్ తయారీ, గ్రీన్ ఎనర్జీ, డేటా స్టోరేజీ, కోర్ ల్యాంగ్వేజెస్ ఆధారిత సేవల వరకు ఏఐ చైన్ మొత్తం మీద భారతదేశం నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని... ఇందుకోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్ అవసరమని పేర్కొన్నారు.