“ఆడబిడ్డల జోలికి వస్తే క్షమించం!”-వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు

పయనించే సూర్యుడు న్యూస్ : నాటకాల రాయుళ్లది రోజుకో రాజకీయం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది బూతుల పార్టీనే’అని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.‘కల్తీ నెయ్యి నిందితులను నడి రోడ్డుపై నిలబెడతాం.కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోడానికే హెరిటేజ్ పై నిందలు వేస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ప్రజలూ కలిసి రావాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన నెయ్యి కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోడానికే హెరిటేజ్ సంస్థపై వైసీపీ నిందలు వేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుల్ని నడి రోడ్డుపై నిలబెడతామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 2024లో అధికారంలోకి వచ్చాక ప్రక్షాళన ప్రారంభించామని అన్నారు. నెయ్యి నమూనాలను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డుకు పంపిస్తే కల్తీ జరిగినట్లు నివేదిక అందించిందని.. అది అసలు నెయ్యి కాదని తేలిందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రసాయనాలతో నెయ్యి తయారు చేసి ప్రసాదంలో వినియోగించినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ తన నివేదికలో కూడా పేర్కొందని స్పష్టం చేశారు. వినుకొండలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజా వేదిక బహిరంగ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత పాలకులు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అత్యంత నాసిరకంగా తయారు చేయించారని..2024 కంటే ముందు తిరుమల దర్శనానికి వెళ్లిన వారంతా ఈ అంశాన్ని గుర్తించారని అన్నారు. శ్రీవారి ప్రసాద పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవ్వరికీ లేదని అలాంటి ప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారని వ్యాఖ్యానించారు. వారు కొనుగోలు చేసిన నెయ్యిని పరీక్షిస్తే జంతువుల కొవ్వు కలిసినట్టు ల్యాబ్ నివేదిక వచ్చిందన్నారు. దీనిపై సెట్ ఏర్పాటు చేస్తే సరఫరా చేసింది నెయ్యే కాదని తేలిందన్నారు. ఆ తప్పును బయటపెడుతుంటే దానిని ఇతరులపై నెట్టి వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని అన్నారు. వివేకా హత్య ఘటనలో నాటకాల రాయుడు రోజుకో వేషం వేశాడని ఆక్షేపించారు. చిన్నాన్న కుమార్తె కూడా మోసపోయేలా నాటకాలు రక్తి కట్టించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తప్పించుకోవడానికి హెరిటేజ్‌పై నిందలు గత పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని, అవినీతి జరిగిందని చెబుతుంటే తిరిగి హెరిటేజ్ పై నిందారోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కల్తీ నెయ్యితో ప్రసాదాన్ని కల్తీ చేసిన వ్యక్తులు ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. దొంగే దొంగా దొంగా అనే పరిస్థితి వచ్చిందని... నిందితుల్ని చట్టం ముందు నిలబెడతామని సీఎం స్పష్టం చేశారు. మసీదు, చర్చి, దేవాలయం ఏదైనా వాటి పవిత్రత కాపాడాలని...ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టగానే టీటీడీలో ప్రక్షాళన చేపట్టామని అన్నారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫొటోలను చెప్పులతో తీసుకెళ్లారని... సభలో రాజకీయం చేసి అనంతరం వేంకటేశ్వరస్వామి ఫొటోలను అక్కడే పడేశారని వ్యాఖ్యానించారు. వారికెందుకు ఇంత అహంకారం అని సీఎం ప్రశ్నించారు. గత పాలనలో రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం చేసి పరిశ్రమల్ని తరిమేశారని ...ఆంధ్రప్రదేశ్ కు ఉన్న నమ్మకాన్ని పోగొట్టారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలు, భవిష్యత్ ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆక్షేపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నిద్ర లేస్తే వారివి చెత్త రాజకీయాలే రాష్ట్రంలో కొందరు చెత్త రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పరామర్శలకు అని వెళ్లి వాళ్ల కార్ల కింద మనుషుల్ని చంపేస్తారని మండిపడ్డారు. బూతులు తిట్టిన వాళ్లను... రౌడీయిజం చేసిన వాళ్లను పరామర్శించే వ్యక్తులు కారు కింద పడిన వారిని మాత్రం పరామర్శించరని సీఎం విమర్శించారు. వైసీపీ నేతల బూతు వ్యాఖ్యలపైనా సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. గతంలో అసెంబ్లీలో తన సతీమణిపై దుర్భాషలాడి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని...అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఆ పార్టీ బూతులు మాట్లాడటం మానలేదని మండిపడ్డారు. వారితో తిట్టించు కోవడానికే రాజకీయం చేస్తున్నామా? అని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆబోతుల మాదిరిగా తయారై రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యతలో ప్రజలూ కలిసి రావాలని సీఎం వ్యాఖ్యానించారు. చెడును నిరాకరించే పరిస్థితి ప్రజల్లో వచ్చినప్పుడే రాజకీయాల ప్రక్షాళన జరుగుతుందన్నారు. ఎన్నికల ముందు ఉన్నపళంగా అరెస్టు చేస్తున్నట్టు చెప్పి తనను జైల్లో వేశారని అక్కడి నుంచి బయటకు రారని తనకు చాలా మంది చెప్పారని అన్నారు. అయినా కేవలం ప్రజల కోసం రాష్ట్రం కోసమే ఇప్పటికీ పోరాటం చేస్తున్నానని సీఎం వ్యాఖ్యానించారు. గత పాలకులు రాష్ట్రాన్ని గంజాయి మయం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో మత్తు సేవించి ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందనే భయంతో మదనపల్లి అత్యాచార కేసులో మృగాడు ప్రాణాలు తీసుకున్నాడని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకే తన తొలి ప్రాధాన్యమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొందరు చెత్త రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.