తప్పుడు కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం

★ అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ భరోసా.

జనం న్యూస్: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఇటీవలే పలు కేసుల్లో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు బుధవారం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్‌ను కలిశారు. వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని ఆయ‌న‌ నివాసంలో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇటీవలే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అంబటి రాంబాబు శుక్రవారం ఉదయం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ క్ర‌మంలో అంబ‌టి రాంబాబు కూట‌మి ప్ర‌భుత్వం త‌న‌పై కక్ష సాధింపునకు పాల్పడుతుందని జగన్ వద్ద మెురపెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల తీరును వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళన వద్దు ధీటుగా ఎదుర్కొందాం: వైఎస్ జగన్. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. చట్టపరంగా ఎదుర్కొందామని మాజీ సీఎం, వైసీపీ అధినే వైఎస్ జగన్ మాజీమంత్రి అంబటి రాంబాబుకు భరోసా ఇచ్చారు. అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరుపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఇలాంటి అక్రమ కేసులకు పార్టీ నాయకులు, క్యాడర్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మాజీమంత్రి అంబటి రాంబాబుతోపాటు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్‌ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌లు ఉన్నారు. జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల. వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు.సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారనే కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది.దీంతో బుధవారం ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయ్యారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ జైలు నుంచి తాను బయటకు రాకుండా చేయాలని కొందరు చాలా ప్రయత్నం చేశారని ఆరోపించారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులను సైతం వేధించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కేసులో బాధితులను లోపల వేశారని, క్రిమినల్స్‌ను వదిలేశారని...అన్నింటికీ దేవుడే సమాధానం చెబుతారని మాజీమంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలగొట్టే వరకు పోరాడుతా. రాజమండ్రి సెంట్రల్ జైలులో తాను 18 రోజులపాటు ఉన్నానని మాజీమంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కక్షగట్టి తనను జైల్లో పెట్టారని ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని.. వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు. రాజమండ్రి జైలు తన పట్టుదలకు శిక్షణగా మారిందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. తన ఇంటిపై ఏడు గంటలు దాడి జరిగిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. పోలీసులు ఉండగానే తన ఇంటిపై దాడి జరిగిందని కానీ పోలీసులు మాత్రం పట్టించుకోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలపై ప్రజలకు అన్ని విషయాలు చెబుతానని అన్నారు. తనపై దాడిని చంద్రబాబు, లోకేష్ మానిటరింగ్ చేశారని ఆరోపించారు. హోంమంత్రి వంగలపూడి అనిత కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేసే పరిస్థితుల్లో లేరన్నారు. ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వెనక్కు తగ్గనని, ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలగొట్టేవరకు పోరాడతానని స్పష్టం చేశారు. అంబటి రాంబాబుపై 36 కేసులు. మాజీమంత్రి అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసుతో పాటు సంక్రాంతి సందర్భంగా సత్తెనపల్లిలో నిర్వహించిన లక్కీ డ్రాలో అవకతవకలకు పాల్పడ్డారని నమోదైంది. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేసిన ఆందోళనలపైనా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.ఈ కేసులలో అంబటి రాంబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ మూడు కేసుల్లోనూ అంబటికి బెయిల్ మంజూరు అయింది. తాజాగా సంక్రాంతి లక్కీ డ్రా కేసులో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.