పయనించే సూర్యుడు న్యూస్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ‘‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’’లో ప్రధాని మోదీ గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రయోజనాలు, సవాళ్లను ప్రస్తావించారు. డీప్‌ఫేక్‌లు మనకు అతిపెద్ద సవాలు అని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం, “డీప్‌ఫేక్‌లు” వంటి భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి… నమ్మకం, పారదర్శకత, ధ్రువీకరణ సామర్థ్యాలను మొదటి నుంచే ఏఐ టెక్నాలజీలో భాగం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏఐ మానవులను శాసించకూడదని… మానవులే ఏఐని శాసించాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సాంకేతికత అనేది మానవాళి అభివృద్ధికి ఒక సాధనంగా మాత్రమే ఉండాలని చెప్పారు. మానవ-కేంద్రీకృత ఏఐ ఎకోసిస్టమ్ కోసం భారత్ దార్శనికతను కూడా వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించాలని పిలుపునిచ్చారు. ఏఐ యుగంలో మానవులు ‘‘కేవలం డేటా పాయింట్లు’’గా మారడానికి అనుమతించకూడదని హెచ్చరించారు ఏఐ వినియోగంలో ‘‘మానవ్ (MANAV)’’ ఉండాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మానవ్ విజన్ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఆయన వివరించారు. M- మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్: నైతిక విలువలు, బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ఏఐ వ్యవస్థలకు మార్గనిర్దేశనం చేయాలి. A – అకౌంటబుల్ (జవాబుదారీతనం): పారదర్శక నిబంధనలతో, జవాబుదారీతనంతో ఏఐ వ్యవస్థలు పనిచేయాలి. N – నేషనల్ సావర్నిటీ (జాతీయ సార్వభౌమత్వం): ఒక దేశంలో సృష్టించిన డేటా.. ఆ దేశానికే చెందాలి. ఆ దేశ పరిధిలోనే ఉండాలి. A – యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్: ఏఐ వ్యవస్థలు గుత్తాధిపత్యం ఉండకూడదు. ఏఐ అన్ని వర్గాల వారికీ అందుబాటులోకి రావాలి. V – వ్యాలిడ్ అండ్ లెజిటిమెట్: ఏఐ చట్టబద్ధంగా, విశ్వసనీయమైనదిగా పనిచేయాలి.‘‘ఏఐ ఒక పరివర్తన శక్తి. దిశానిర్దేశం లేకుండా వదిలేస్తే… అది అవరోధాలను సృష్టిస్తుంది. సరైన దిశానిర్దేశం చేస్తే, అది ఒక పరిష్కారం అవుతుంది. ఏఐని యంత్ర కేంద్రీకృతం నుంచి మానవ కేంద్రీకృతంగా ఎలా మార్చాలి, దానిని సున్నితంగా, ప్రతిస్పందనాత్మకంగా ఎలా మార్చాలి అనేది ఈ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రధాన లక్ష్యం’’ అని ప్రధాని మోదీ అన్నారు.