నిరుద్యోగ యువతకు భారీ ఊరట-ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్

* మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ తెలిపింది.ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. గతేడాది నిర్వహించిన డీఎస్సీ తరహాలో ఉగాదికి విడుదల చేయబోయే జాబ్ క్యాలండర్‌లో అధ్యాపక పోస్టుల నోటిఫికేషన్ కూడా ఇచ్చి, భర్తీకి చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్న తరుణంలో ఉపాధి కల్పనపైనే యంత్రాంగం దృష్టిపెట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో ఎపీఎస్ఎస్ డీసీ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో ఈ ఏడాది 2లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం, అందుకు అనుగుణంగా అధికారులు రూట్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఇప్పటికే గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో పెద్దఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టిసారించండి. రిలయన్స్ సీబీజీ, జుపిటర్, లారెన్స్ ఫార్మా, హెట్రో డ్రగ్స్ తోపాటు రాష్ట్రంలో కొత్తగా వస్తున్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేపట్టండి. ఇందుకు అవసరమైన కరిక్యులమ్ రూపకల్పనలో ఆయారంగాల్లో పేరుగాంచిన పరిశ్రమల సలహాలను తీసుకోండి. ఇప్పటికే కొన్ని ప్రధాన సంస్థలు నేరుగా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలను నెలకొల్పాయి, వాటిని అధ్యయనం చేసి, అదేతరహాలో ఐటీఐలకు అనుబంధంగా ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేలా చూడాలని సూచించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మూడునెలలకోసారి నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి అని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. త్వరలో ఏఐ ఆధారిత నైపుణ్యం పోర్టల్ ప్రారంభం సాధ్యమైనంత త్వరలో పోర్టల్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ఇందుకు సంబంధించి ఇప్పటికే మాడ్యూల్స్ సిద్ధమయ్యాయి. 25 రంగాలకు సంబంధించి డేటా ఇంటిగ్రేషన్ పూర్తయింది.వాటిలో 1,14,899 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 3,100 విదేశీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 16మంది రిక్రూటర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇందులో ట్రయల్ బేసిస్ లో ఇప్పటికే 20వేలమందికి పైగా విద్యార్థులు, 60వేలమంది జాబ్ సీకర్స్ కు విజయవంతంగా కీలకమైన ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అధ్యాపక పోస్టుల భర్తీపై సమీక్ష రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి లోకేశ్ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ తరహాలో ఉగాదికి విడుదల చేయబోయే జాబ్ క్యాలండర్ లో అధ్యాపక పోస్టుల నోటిఫికేషన్ కూడా ఇచ్చి, భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన విదేశీ యూనివర్సిటీలకు (ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ (FHEIs)కు ప్రోత్సాహకాలు, విధివిధానాలపై చర్చించారు. విద్యార్థుల ఆత్మహత్య, మానసిక ఒత్తిడి నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కోచింగ్ సెంటర్ రెగ్యులేషన్స్ రూపకల్పనపై పబ్లిక్ డొమైన్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సీఈవో గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *