
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది ఉగాదికి మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవలే మెగా డీఎస్సీ ద్వారా 15,941 పోస్టులను భర్తీ చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరోసారి 3600 పోస్టులతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 16347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో డీఎస్సీ ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఇటీవల విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది ఉగాదికి మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3600 డీఎస్సీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అని తెలుస్తోంది. 3600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉగాది కానుకగా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ప్రకటన విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలల నుంచి ప్రాథమికంగా తేలిన లెక్కల ప్రకారం 1200 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయని తేలింది. మరోవైపు పంచాయతీరాజ్, పురపాలక, ప్రభుత్వ పాఠశాలల్లో 1,700 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఇవి కాకుండా ప్రత్యేక విద్య పోస్టులు 700 వరకు భర్తీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మెుత్తం 3600కి పైగా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది సిలబస్ కొనసాగింపు ఇకపోతే ఈ ఏడాది ఉగాదికి ఇచ్చే డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేవు అని తెలుస్తోంది. పాత సిలబస్ ప్రకారమే అంటే గతేడాది డీఎస్సీకి ఇచ్చిన సిలబస్, మార్గదర్శకాలనే ఈసారీ అమలు చేయనున్నట్లు సమాచారం. ప్రత్యేక డీఎస్సీ సిలబస్‌ను ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. అన్ని పోస్టులకూ ఆంగ్ల భాష ప్రావీణ్యం పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్యం పరీక్ష నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ సమయాభావం లేకపోవడంతో ఈ ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పంద టీచర్లకు వెయిటేజీపై ఆలోచన. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 2,600 మంది వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది సీనియర్ టీచర్లు సైతం ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం వీరిలో అన్ని అర్హతలూ ఉన్న సుమారు 800 మందికి మినిమం టైం స్కేల్ అమలు చేయనుంది. పదేళ్ల సర్వీసు, టెట్ వంటి అర్హతలు కలిగిన వారికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తారు. పర్మినెంట్ ఉద్యోగం కోసం వీరూ డీఎస్సీ రాయాల్సి ఉంటుంది.ప్రత్యేక డీఎస్సీలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న టీచర్లకు వెయిటేజీ ఇచ్చే అంశపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.