పయనించే సూర్యుడు : ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, శక్తి, ఉపాధి, వ్యవస్థాపకత (Entrepreneurship) మధ్య సమతు ల్యతను సాధిస్తూ…గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను మొత్తం దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (CURE)ను కాలుష్యరహిత గ్రీన్, నెట్ జీరో సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి, సుస్థిర పట్టణాభివృద్ధిలో హైదరాబాద్ నగరాన్ని దేశానికే ఒక నమూనాగా నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని, రాబోయే ఐదేళ్లలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో కాలుష్య కారక పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన “ముంబై క్లైమెట్ వీక్” సదస్సులో నీతి ఆయోగ్ (NITI Aayog) వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఇతర అతిథులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై ముఖ్యమంత్రి తెలంగాణ దృక్పథాన్ని వివరించారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ‘గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయక మని, తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోనూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.ప్రస్తుత అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రస్తావిస్తూ, రాష్ట్ర జీడీపీని 200 బిలియన్ డాలర్ల స్థాయి నుండి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తా యని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.