
పయనించేసూర్యుడు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 15వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 27 ప్రాజెక్టులు, రూ.29,021 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులతో 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రాతిపదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు.ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులు త్వరితగతిన కార్యరూపం దాల్చాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటివరకు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల యాజమాన్యాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 15వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేసింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, సీఎస్ కె.విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రూ.29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 15 వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన 27 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 15 వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలియచేసింది. వీటి ద్వారా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలైన గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్ వంటి మెగా ప్రాజెక్టులు వరుసగా ఏర్పాటు కావాల్సి ఉందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భూ కేటాయింపులు జరిపినప్పటికీ నిర్ణీత కాల వ్యవధిలో పనులు ప్రారంభించని సంస్థలతో సంప్రదింపులు జరపాలని.... నిర్మాణానికి ముందుకు రాకుంటే భూములు వెనక్కి తీసుకునేందుకు వెనకాడవద్దని చెప్పారు. దీనిపై మంత్రుల కమిటీ దృష్టి పెట్టి...అవసరమైతే అనుమతులు రద్దు చేయాలన్నారు. ప్రతీ ఒప్పందమూ వేగంగా సాకారం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేలా ఎన్నారైలను ఆహ్వానించాలని అధికారులను సీఎం నిర్దేశించారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులు మరిన్ని వచ్చేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అలాగే సొంత భూముల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఐకానిక్‌గా విశాఖలో ‘భారత్ మండపం’ విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. సూర్యలంక, పోలవరం, పులికాట్, గండికోట, శ్రీశైలం, మదనపల్లి, హర్స్‌లీ హిల్స్ వంటి క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆయా క్లస్టర్లలో షాపింగ్ మాల్స్, హోటల్స్ వంటివి వస్తే పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకోవచ్చని చెప్పారు. విశాఖలో భారత్ మండపం వస్తోందని అది ఐకానిక్‌గా నిలిచేలా చూడాలన్నారు. దేశంలోనే అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్‌గా నిలవాలన్నారు. అలాగే ప్రతీ జిల్లాలో శిల్పారామాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ, ఏలూరు లాంటి ప్రాంతాలు సహా రాష్ట్రంలో మరిన్ని హోటళ్లు, కన్పెన్షన్ సెంటర్లు రావాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. 50 వేల రూములు లక్ష్యం కావాలన్నారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి మెగా ఈవెంట్లు కూడా జరగాల్సి ఉందన్నారు. స్పోర్ట్స్ సిటీ, క్రియేటివ్ సిటీ ఎకో సిస్టం లాంటివి రాష్ట్రంలో నెలకొనాలన్నారు. హెల్త్ టూరిజం కూడా గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు.