
సాక్షి డిజిటల్ న్యూస్ :సాధారణంగా రైళ్లలో కొన్ని బెర్తులను వివిధ కోటాల కింద కేటాయిస్తారు. మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేకంగా సీట్లు ఉంటాయి. అలాగే, అత్యవసర కోటా కూడా ఉంటుంది. తాజాగా, ఈ కోటాను వందే భారత్ స్లీపర్ రైలు, అమృత్ భారత్ సర్వీసుల్లో ప్రారంభిస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఏ ఏ క్లాసులో ఎన్ని బెర్తులు ఉండాలని అని అన్ని రైల్వే జోనల్ కార్యాలయాలకు ఆదేశాలు జారీచేసింది. దీని ప్రకారం ఎమర్జెన్సీ ససమయంలో ఉన్నతాధికారులు వినియోగించుకోవచ్చు. ఇటీవల ప్రారంభమైన వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో అత్యవసర కోటాను రైల్వే శాఖ తాజాగా పునరుద్ధరించింది. ఈ రైళ్లలో ఇప్పటి వరకూ మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రత్యేక కోటాలు ఉండేవి. కానీ, ప్రయాణికుల అవసరాలు, బెర్తుల అందుబాటు, ఎగ్జిక్యూటివ్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ కోటాను పునరుద్ధరించాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. అత్యవసర ప్రయాణాలకు అనుగుణంగా ఈ కోటా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని జోనల్ కార్యాలయాలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు పూర్తిస్థాయి మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏడు లేదా అంత కంటే ఎక్కువ బోగీలు ఉండే అమృత్ భారత్ రైళ్లల్లో 24 ఎమర్జెన్సీ బెర్తులు అందుబాటులో ఉంటాయి. అలాగే, వందే భారత్ స్లీపర్ రైళ్ల విషయానికి వస్తే.. ఫస్ట్ క్లాస్ ఏసీలో సాధారణ రోజుల్లో నాలుగు, వారాంతాల్లో ఆరు ఎమర్జెన్సీ బెర్తులు, టూటైర్ ఏసీలో సాధారణ రోజుల్లో 24 బెర్తులు, వారాంతాల్లో 30 బెర్తులు, థర్డ్ ఏసీ బోగీల్లో సాధారణ రోజుల్లో 24 బెర్తులు, వారాంతాల్లో 42 బెర్తులు అత్యవసర బెర్తులు అందుబాటులో ఉంచాలి. అమృత్ భారత్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించింది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ ఉంది. దీంతో మరిన్ని అమృత్ భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అమృత్ భారత్ రైళ్లతోపాటు వందే భారత్ స్లీపర్ రైళ్ల శరవేగంగా తయారవుతున్నాయి.