
పయనించే సూర్యుడు న్యూస్ : డాటా సెంటర్లకు ఏర్పాటు విషయంలో వివిధ రాష్ట్రాలు కొనసాగిస్తున్న రాయితీలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డాటా సెంటర్లకు భూ కేటాయింపులో హేతుబద్ధత ఉండాలని సూచించారు. తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతంలోని మూడు నగర పాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పరిశుభ్రత విషయంలో క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలన చేస్తానని....ఎక్కడైనా చెత్త కనపడితే సహించమని అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి నగర పాలక సంస్థల కమిషనర్లు తెల్లవారుజామున ఆరు గంటలకే క్షేత్ర పర్యటనలు చేయాలని ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మూడు నగర పాలక సంస్థల పరిధిలో ప్రకటనల ఆదాయం పెంపు పాలసీపై సమీక్షించారు. వివిధ అంశాలపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రైవేట్ భూముల్లోనూ మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు ‘నగరంలో కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రిక్, ఇతర కేబుళ్లు, సీసీ కెమెరాలు, ప్రకటనల బోర్డులు వాటిపై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు భూముల్లోనూ మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలి. నెక్లెస్ రోడ్డు పక్కన పలు ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి’అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రకటనలకు సంబంధించి పెద్ద మొత్తంలో వివిధ రకాల బోర్డులు కనిపిస్తున్నా ఆశించిన ఆదాయం రాకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ముంబయి, అహ్మదాబాద్, బెంగళూర్‌ల్లోని ప్రకటనల ఆదాయంతో నగరంలో వస్తున్న ఆదాయాన్ని బేరీజు వేయాలని చెప్పారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్న ప్రకటనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రకటనలకు 10 శాతం బోర్డులు కేటాయించాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా పీపీపీ, ఇతర నమూనాల్లో ఆదాయం సమకూర్చుకునే అంశంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దానిని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. వీధి దీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ సిస్టమ్ ‘మూడు నగర పాలక సంస్థలతో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ సిస్టమ్ అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్పొరేషన్ల పరిధిలోని పార్కుల వివరాలు, వాటి అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లతో త్వరలోనే ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలను సమగ్రంగా వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. డాటాసెంటర్లకు భూ కేటాయింపులో హేతుబద్దత ఉండాలి మరోవైపు డాటా సెంటర్లకు ఏర్పాటు విషయంలో వివిధ రాష్ట్రాలు కొనసాగిస్తున్న రాయితీలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డాటా సెంటర్లకు భూ కేటాయింపులో హేతుబద్ధత ఉండాలని సూచించారు. రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు, వారికి అవసరమైన భూమి, ఇతర వసతులపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్షించారు. వివిధ ప్రాంతాల్లో డాటా సెంటర్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సాగుతున్న భూ సేకరణపై అధికారులను ఆరా తీశారు. భూ పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సూచించారు. రైతులను పిలిచి మాట్లాడి వారు సంతృప్తి చెందేలా పరిహారం నిర్ణయించాలన్నారు. వేల కోట్లరూపాయలతో పెట్టుబడులు పెట్టే సంస్థలు భూమిపై పెట్టె పెట్టుబడి చాలా స్వల్పమన్నారు. కంపెనీలకు సకాలంలో భూమి, ఇతర వసతులు అందుబాటులో ఉంచితే త్వరగా పనులు పూర్తి చేసుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ , ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంకతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.