ఆ 5 పంచాయతీలను మళ్లీ మాకిచ్చేయండి… సమన్వయంతో సాగుదాం

* సీఎం చంద్రబాబును కోరిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. పునర్విభజనలో ఆంధ్రాలో కలిపిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని కోరారు. అలాగే తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని…ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయంతో సాగుదాం అని సీఎం చంద్రబాబును మంత్రి తుమ్మల కోరారు. తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్‌లూమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రాలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.తిరుమలలో తెలంగాణ రాష్టానికి 5 ఎకరాల స్థలం కేటాయింపుకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకరించండి అని కోరారు.అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించిన సాగునీటి వసతులు, భక్తులు మరియు ప్రజల సౌకర్యానికి సంబంధించిన పలు కీలక విజ్ఞప్తులు చేశారు. 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయండి రాష్ట్ర పునర్విభనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అయిదు గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండటం వల్ల ప్రజలు పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ గ్రామాలు గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంక్లేవ్‌లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రజలు దాదాపు 8 గంటలు ప్రయాణించాల్సి వస్తోందని మంత్రి పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, పన్నులు, పరిపాలనా అనుసంధానం లోపం, భద్రతా సమస్యలు వంటి అంశాలు స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని సీఎం చంద్రబాబుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. పెద్దవాగు సాగునీటి ప్రాజెక్టుపై చర్చ మరోవైపు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించిన భూభాగాల్లో కొంత భాగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటం వల్ల దేవస్థానం పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. భక్తులకు మెరుగైన సేవలు అందించాలంటే ఈ గ్రామాల విలీనం అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ చర్య కీలకమని మంత్రి తుమ్మల తెలిపారు. అలాగే ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్ట్ శాశ్వత మరమ్మత్తులు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 16,000 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, అందులో సుమారు 13,640 ఎకరాలు (85.25%) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2,360 ఎకరాలు (14.75%) తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రాజెక్ట్ శాశ్వత పునరుద్ధరణకు సుమారు రూ.92.20 కోట్ల వ్యయం అంచనా వేయబడిందని, రెండు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఖర్చును 85:15 నిష్పత్తిలో భరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సాగు, జీవనాధారం ఈ ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఉన్నందున తక్షణ ఆర్థిక సహకారం అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. 3వ స్లూయిస్ వద్ద దెబ్బతిన్న గోడపై చర్చ ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరి వరద రక్షణ కరకట్టలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతిన్న విషయం కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించారు. భద్రాచలం పట్టణాన్ని వరదల నుంచి రక్షించేందుకు నిర్మించిన ఈ రక్షణ గోడలో జరిగిన ఈ నష్టం భవిష్యత్తులో భారీ ప్రమాదానికి దారితీయొచ్చని పేర్కొన్నారు. కరకట్టలోని ఆ భాగం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లడంతో నిర్వహణలో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని మంత్రి తెలిపారు. తక్షణ సాంకేతిక పరిశీలన చేసి తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, రెండు రాష్ట్రాల సమన్వయంతో శాశ్వత పునరుద్ధరణ చర్యలు ప్రారంభించాలని కోరారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *