
సాక్షి డిజిటల్ న్యూస్ : రష్యా చమురు దిగుమతులపై కేంద్రమంత్రి జైశంకర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు ఏది సరైంది అనిపిస్తుందో అదే చేస్తుందని స్పష్టం చేశారు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించాలని భారత్‌పై ట్రంప్ ఒత్తిడి తీసుకువస్తున్నారా అనే ప్రశ్నకు జైశంకర్ స్పందించారు. భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విధానానికి కట్టుబడి ఉంటుందని.. భారతదేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని జైశంకర్ తేల్చి చెప్పారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా చమురు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించిందని.. అందుకే తాము భారత్‌పై విధించిన టారిఫ్‌లను తగ్గించినట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అయితే భారత్ మాత్రం.. రష్యా చమురుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ విషయంలో పెద్ద ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జపాన్‌లోని మ్యూనిచ్ పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో భాగంగా జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడెఫుల్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. అయితే రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు తగ్గించాలని భారత్‌పై ఒత్తిడి వస్తోందా అని అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానం ఇచ్చారు. ప్రపంచ ఆయిల్ మార్కెట్ చాలా సంక్లిష్టంగా ఉంటుందని పేర్కొన్న జైశంకర్.. యూరప్ లేదా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న చమురు సంస్థలు, ఖర్చు, నష్టాలను అంచనా వేసి భారత్ కొనుగోళ్లు చేస్తుందని వెల్లడించారు. తమకు ఏది లాభమో చూసుకుని.. వాటి ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సొంతంగా నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని భారత్ ఎప్పుడూ కలిగి ఉంటుందని తేల్చి చెప్పిన జైశంకర్.. ఇది భారతదేశ చరిత్రలో ఒక భాగమని, అదే భారత విధానమని స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల ఆలోచనలు, విధానాలతో తాము ఏకీభవించాల్సిన అవసరం లేదని జైశంకర్ వెల్లడించారు. ఆయిల్ కొనుగోళ్లలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవని తేల్చి చెప్పారు. అది పూర్తిగా దేశ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. మరోవైపు.. ఇటీవలె భారత్ అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే భారత దిగుమతులపై టారిఫ్‌లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇందులో భాగంగానే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని భారత్ నిలిపివేసేందుకు రెడీగా ఉందని పేర్కొన్నారు. కానీ దీనిపై భారత్ మాత్రం ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే జైశంకర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో రష్యా చమురుపై అమెరికాకు ఒక క్లారిటీ ఇచ్చినట్లయింది.