ప్రతి తండాలో స్కూల్, పంచాయితీ భవనం.

★సీఎం రేవంత్

సాక్షి డిజిటల్ న్యూస్ : నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యద్భుతంగా పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారా భవన్‌లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఆదివాసీలకు ఆదిలాబాద్‌లో నాగోబా దేవాలయం, మేడారంలో సమ్మక్క - సారలమ్మ పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజారాలకు ప్రత్యేక క్షేత్రం లేదని పేర్కొన్నారు. అందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించినందున, అక్కడ బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రం నిర్మిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఆ పుణ్యక్షేత్రాన్ని గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని అన్ని తండాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. మానవజాతి శాంతి మార్గంలో, చెడును విడిచి, భక్తితో సన్మార్గంలో నడవాలని బోధించిన సంత్ సేవాలాల్ దేశంలో 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. అలాంటి మహనీయుని జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, పునర్నిర్మాణంలో లంబాడా సోదరుల పాత్ర ఎవరూ మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారికి సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంలో సముచిత స్థానం, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.