మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు

★ఎక్స్ అఫీషియో ఓటుపై కమిషన్ మార్గదర్శకాలు

సాక్షి డిజిటల్ న్యూస్ : మున్సిపల్ చైర్మన్,మేయర్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ఏ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లోనైనా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేయాలంటే, సదరు పురపాలిక పరిధిలో ఓటరుగా నమోదు కావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పూర్తైన సంగతి తెలిసిందే. పోలింగ్ పూర్తై రిజల్ట్స్ సైతం విడుదల అయ్యాయి.అయితే మున్సిపల్ చైర్మన్..వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగాల్సి ఉంది. మున్సిపల్ ఛైర్మన్, కార్పొరేషన్ మేయర్ల ఎన్నికలో అత్యంత కీలకమైన ఎక్స్ అఫీషియో ఓట్లపై ఈసీ బాంబు పేల్చింది.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉండే ఎక్స్‌అఫీషియో అధికారానికి సంబంధించి ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలను విడుదల చేసింది.హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులకు మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వేసే అవకాశం లేదని తేల్చి చెప్పింది. వారికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం లేనట్లే అని ఈసీ పేర్కొంది. ఈ ఎక్స్‌అఫీషియో ఓటు నమోదుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి నేటితో (గడువు తేదీ) సమయం ముగుస్తుంది అని తెలంగాణ ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎక్స్ ఆఫీషియో ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్,కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్స్‌ ఆఫిషియో సభ్యుల అర్హతలపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. మున్సిపల్ ప్రాంతంలో ఓటర్‌గా రిజిస్టర్ అయితేనే అర్హత అని పేర్కొంది. లోక్‌సభ MP, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు కల్పించింది. అయితే రాజ్యసభ( MP),ఎమ్మెల్సీకి కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అర్హతలేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు అని ఈసీ పేర్కొంది. అర్హత లేకుండా వేసిన ఓటు చెల్లదు అని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. అర్హత లేని వ్యక్తిని సభ్యుడిగా పరిగణించరు అని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు సర్క్యులర్ పంపిణీ చేసింది. స్థానికంగా ఓటు కలిగి ఉండాలి ఇకపోతే గతంలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలోని తమకు నచ్చిన మున్సిపాలిటీని ఎంచుకుని ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం ఉండేది. ఈ అంశంపై హైకోర్టులో కేసు నడుస్తోంది. అయితే దీనిని విచారించిన న్యాయస్థానం స్థానిక ఓటు లేకుండా ఇతర ప్రాంతాల్లో ఓటు వేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఎస్‌ఈసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండాలనుకుంటున్నారో, అక్కడ వారి పేరు ఓటరు జాబితాలో ఉండాలి. ఒకవేళ మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే, వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగడానికి అనర్హులు. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేకుండా వేసే ఓట్లు ఏవైనా ఉంటే అవి చెల్లవని ఎస్‌ఈసీ స్పష్టంగా పేర్కొంది. తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019 ప్రకారం ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఈసీ ఆదేశించింది.