ET Now GBS 2026లో ప్రధాని మోదీ

★సంస్కరణలు దృఢ సంకల్పంతోనే అమలు

సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం కొత్త ఇంజిన్‌గా ఉద్భవిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌ 2026లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం కొత్త ఇంజిన్‌గా ఉద్భవిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ వృద్ధికి తన వంతు సహకారం అందిస్తోందని చెప్పారు. రాబోయే సంవత్సరాలలో భారతదేశ సహకారం నిరంతరం పెరుగుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. గత దశాబ్ద కాలంలో అనేక అంతరాయాలు ఉన్నప్పటికీ... భారత్ అత్యుత్తమ అభివృద్దిని సాధించిందని చెప్పారు. అలాగే, భారతదేశం అనేక సవాళ్లను అధిగమించిందని... 11వ స్థానం నుంచి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో జరుగుతున్న ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్‌ సమ్మిట్‌ 2026కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి టైమ్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ జైన్ స్వాగతం పలికారు. ఈ వేదికపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ... రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక కొత్త ప్రపంచ క్రమం ఏర్పడిందని చెప్పారు. అయితే ఏడు దశాబ్దాల తర్వాత ఆ క్రమం విచ్ఛిన్నమవుతోందని... ప్రపంచం నేడు మరో కొత్త క్రమం వైపు పయనిస్తోందని అన్నారు. ప్రపంచం నేడు మాట్లాడుతున్న ‘‘శతాబ్దపు పరివర్తన’’కు భారతదేశం బలమైన పునాది వేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో, భారతదేశం ప్రపంచ అభివృద్ధికి ఇంజిన్‌గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత దశాబ్ద కాలంలో సాంకేతికత, ఆవిష్కరణలను అభివృద్ధికి కీలక స్తంభాలుగా పరిగణించామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ దార్శనికతతోనే దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను పెంపొందించామని... నేడు భారతదేశంలో 2,00,000 కంటే ఎక్కువ నమోదిత స్టార్టప్‌లు ఉన్నాయని చెప్పారు. ఇది దేశ ఆవిష్కరణ సామర్థ్యాన్ని, వ్యవస్థాపక బలాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. గత దశాబ్దం తీవ్ర గందరగోళంతో నిండిపోయిందని అన్నారు. ‘‘ప్రపంచం చాలా సవాళ్లను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సప్లై చైన్‌ల అంతరాయాలు వంటి తీవ్రమైన సవాళ్లను కూడా ప్రపంచం చూసింది. సంక్షోభ సమయాల్లో ఏ దేశానికైనా నిజమైన బలం, సామర్థ్యం బయటపడుతుందని చెబుతారు. ప్రపంచ అంతరాయాలు ఉన్నప్పటికీ, భారతదేశం తనను తాను నిరూపించుకుంది. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ దశాబ్దం భారతదేశానికి వృద్ది, అద్భుతమైన డెలివరీ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.