
సాక్షి డిజిటల్ న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి గురువారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా కలిశారు. ఈ సందర్బంగా ఆయనకు పలు ప్రాజెక్టులపై అభ్యర్థనలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించి అంశాలపై చర్చించడంతో పాటు, వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయం అందించాల్సిందిగా కోరుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి గురువారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా కలిశారు. ఈ సందర్బంగా కృష్ణా - వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని అశ్విని వైష్ణవ్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్న విషయం తెలియజేశామని గుర్తు చేశారు. కృష్ణా - వికారాబాద్ మార్గంలోని టేకల్‌కోడ్ లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని... అలాగే సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అందజేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని చెప్పారు. కొడంగల్, టేకల్‌కోడ్, దౌల్తాబాద్‌లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ - చెన్నై (778 కి.మీ.), హైదరాబాద్ - బెంగళూర్ (586 కి.మీ.), హైదరాబాద్ - పుణే (556 కి.మీ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే హైస్పీడ్ రైలు మార్గాలని ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళుతుందని... అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని అభ్యర్థించారు. తద్వారా డ్రైపోర్ట్ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతం అవుతుందని చెప్పారు. హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే ప్రారంభమైతే అది ట్రై జంక్షన్ అవుతుందని అన్నారు. ఈ మూడు కారిడార్లకు భూ సేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరగా... కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారు సానుకూలత వ్యక్తం చేశారని తెలంగాణ సీఎంవో తెలిపింది. అలాగే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని పేర్కొంది. రామ్మోహన్ నాయుడుతో రేవంత్ రెడ్డి భేటీ... కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్బంగా తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ కు సమీపంలో నిర్మించనున్న మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్, ఓవర్ హాల్ రిపేర్ (ఎంఓఆర్) సదుపాయాలు ఉండేలా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జౌళి, ఇతర పరిశ్రమలతో వరంగల్ నగరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. వరంగల్‌కు దగ్గరలో రెండేళ్లకోకసారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క - సారలమ్మ జాతర మేడారంలో నిర్వహించడం వంటి ప్రాధాన్యతలను వివరించారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు కేంద్రంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మామునూరు నుంచి సాధ్యమైనంత త్వరగా విమాన రాకపోకలు సాగేలా పనులు ప్రారంభించేలా అనుమతులను తక్షణం మంజూరు చేయాలని కోరారు.