
జనం న్యూస్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని DAC 114 రాఫెల్, 6 బోయింగ్ P-8I విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పర్యటనకు ముందే అనుమతి లభించింది. దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) గురువారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వైమానిక దళం కోసం 114 రాఫెల్ యుద్ధ విమానాలు, నేవీ కోసం ఆరు బోయింగ్ P-8I నిఘా విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 3.25 లక్షల కోట్ల విలువైన ఈ ఒప్పందానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనకు ముందే అనుమతి లభించడం విశేషం. ప్రస్తుతం వైమానిక దళంలో ఉండాల్సిన 42 స్క్వాడ్రన్ల స్థానంలో కేవలం 29 మాత్రమే ఉన్నాయి. ఈ లోటును పూడ్చేందుకు ఈ నిర్ణయం ఎంతో కీలకం కానుంది. డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ బోర్డు నుంచి ఇప్పటికే అనుమతి రాగా, త్వరలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) దీనికి తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ ఒప్పందం పూర్తయితే భారత వాయుసేనలో రాఫెల్ విమానాల సంఖ్య 150కి చేరుతుంది. మరోవైపు నేవీ కోసం విమానవాహక నౌకలపై వాడే 26 రాఫెల్ విమానాలు కూడా రానున్నాయి. 2020లో తొలిసారిగా ఐదు రాఫెల్ జెట్‌లు చేరగా, అప్పటి నుంచి సరిహద్దు రక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత ఏడాది జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’లో రాఫెల్ విమానాలు అద్భుతంగా పనిచేశాయని వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ ప్రశంసించారు. అలాగే సముద్రంలో నిఘా కోసం వాడే బోయింగ్ P-8I విమానాలు కూడా నేవీకి ఎంతో ముఖ్యం. ప్రస్తుతం నేవీ వద్ద ఇలాంటివి 12 విమానాలు ఉండగా, ఇవి హిందూ మహాసముద్రంలో రక్షణకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఇక బడ్జెట్ విషయానికి వస్తే, 2026-27 కేంద్ర బడ్జెట్‌లో రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో రూ. 7.8 లక్షల కోట్లు కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్‌లో సుమారు 15 శాతంగా ఉంది. ఇందులో కొత్త ఆయుధాలు, విమానాల కొనుగోలు (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) కోసం 28 శాతానికి పైగా నిధులు కేటాయించారు. సైనికుల జీతభత్యాలు, పెన్షన్లు, నిర్వహణ ఖర్చుల కోసం మిగిలిన నిధులను వినియోగిస్తారు. ఆధునీకరణ కోసం ప్రత్యేకంగా రూ. 2.19 లక్షల కోట్లు కేటాయించగా, అందులో రూ. 1.85 లక్షల కోట్లు కేవలం కొత్త కొనుగోళ్ల కోసమే ఉండటం గమనార్హం. ఇది గత ఏడాదితో పోలిస్తే 24 శాతం ఎక్కువ. రాఫెల్ యుద్ధ విమానాలే కాకుండా రక్షణ శాఖ మరిన్ని భారీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది. అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, నౌకలు, జలాంతర్గాములు, డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని సైన్యాన్ని అన్ని విధాలా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానానికి, విదేశీ ఒప్పందాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.