తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపు (ఫిబ్రవరి 13, 2026) ఉదయం 8 గంటలకు నిర్దేశిత కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపు (ఫిబ్రవరి 13, 2026) ఉదయం 8 గంటలకు నిర్దేశిత కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం అవసరమైన సూపర్ వైజర్లు, అసిస్టెంట్లను ఇప్పటికే నియమించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, కేంద్రాల పరిసరాల్లో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 (నిషేధాజ్ఞలు) అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ హాల్ లోపలికి కేవలం సూపర్ వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. వీరందరూ తప్పనిసరిగా జారీ చేసిన పాసులు కలిగి ఉండాలి. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించరు. పారదర్శకత కోసం అన్ని కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వెలుపల వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఇటీవల ముగిసిన ఈ ఎన్నికల్లో 73.01 శాతానికి పైగా పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టి, అది పూర్తయ్యాక సాధారణ బ్యాలెట్ బాక్సులను తెరుస్తారు. వార్డులవారీగా బ్యాలెట్ బాక్సులను టేబుల్ వద్దకు తీసుకువచ్చి, ఒక్కో పోలింగ్ స్టేషన్ ఓట్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. మిగిలిన చిల్లర ఓట్లను (25 కంటే తక్కువ ఉంటే) విడిగా ఉంచి స్లిప్ అంటిస్తారు. ఆయా పోలింగ్ స్టేషన్ల వివరాలు నమోదు చేసిన తర్వాత, వార్డులోని అన్ని బ్యాలెట్ కట్టలను ఒక పెద్ద డ్రమ్ములో వేసి బాగా కలుపుతారు. దీనివల్ల ఏ పోలింగ్ స్టేషన్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలియకుండా గోప్యత పాటించవచ్చు. అసంపూర్తిగా ఉన్న కట్టలను సాధ్యమైనంత వరకు కలిపి పూర్తి కట్టలుగా మారుస్తారు. మిగిలిన చిల్లర ఓట్లను విడిగా ఉంచి లెక్క రాస్తారు. ఈ ప్రక్రియను ప్రతి వార్డుకూ ఇదే రీతిలో అనుసరిస్తారు. బ్యాలెట్లను బాగా కలిపిన తర్వాత అసలు లెక్కింపు మొదలవుతుంది. ప్రతి రౌండ్‌లో డ్రమ్ము నుంచి యాదృచ్ఛికంగా 1000 ఓట్లను (40 కట్టలు) తీసి కౌంటింగ్ టేబుళ్లకు పంపిస్తారు. అక్కడ అభ్యర్థులు, నోటా, సందేహాస్పద ఓట్ల కోసం వేర్వేరు గదులున్న చెక్క ట్రేలను ఉపయోగిస్తారు. ప్రతి ఓటును ఏజెంట్లకు చూపిస్తూ దాని చెల్లుబాటును నిర్ధారించి, సంబంధిత అభ్యర్థి ట్రేలో వేస్తారు. అభ్యర్థుల వారీగా వచ్చిన చెల్లుబాటయ్యే ఓట్లను 100 చొప్పున కట్టలుగా కడతారు. అలాగే నోటా, సందేహాస్పద ఓట్లను కూడా 100 చొప్పున బండిల్ చేస్తారు. వందకు తక్కువగా ఉన్న ఓట్లను విడిగా ఉంచి ఆ సంఖ్యను స్లిప్ పై రాస్తారు. సందేహాస్పద ఓట్లపై రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ) తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రతి రౌండ్ పూర్తయ్యాక అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, తిరస్కరించిన ఓట్ల వివరాలను 'ఫైనల్ రిజల్ట్ షీట్'లో నమోదు చేసి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. వార్డులోని అన్ని ఓట్ల లెక్కింపు, సందేహాస్పద ఓట్ల పరిష్కారం పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. లెక్కింపు పూర్తయ్యాక, వివరాలన్నీ సరిచూసుకున్న అనంతరం ఫలితాలను అధికారికంగా ప్రకటించి గెలిచిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 16న జరిగే అవకాశం ఉంది. మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్ల ఎన్నిక కూడా అదే రోజు జరగనుంది.