జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్

★కేసు నమోదుకు ఆదేశాలు

సాక్షి డిజిటల్ న్యూస్ : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ ‌అయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ ‌అయింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా సంగారెడ్డిలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగ్గారెడ్డి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి కేసు మోదు చేసి, రిపోర్టు ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై జగ్గారెడ్డి స్పందిస్తూ... దొంగ ఓటు వేసేవారిని అడ్డుకునేందుకు తమపై కేసులు పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడం సరైనదేనా అని ప్రశ్నించారు. గతంలో ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి, సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేస్తున్నవారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు. అయితే సీఐ శివకుమార్ కాంగ్రెస్ నేత కాలర్ పట్టుకున్నారని ఆరోపించారు. దీంతో తాను అక్కడికి వెళ్లానని, ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుందని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈరోజు జరిగిన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ సందర్భంగా సంగారెడ్డిలో పట్టణంలోని 34వ వార్డు పోలింగ్‌ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సీఐ శివకుమార్.. 34 వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి కాలర్ పట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి నేరుగా 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. సీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి... పోలీంగ్ ఆపేస్తామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో పోలీసులు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొంత తోపులాట కూడా జరిగింది. సీఐ శివకుమార్ ఇక్కడకు రావాలంటూ పోలీసులపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికే సీఐ శివకుమార్ ఇక్కడికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐని సస్పెండ్‌ చేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు.ఇక, తెలంగాణ రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలోని 2,582 వార్డులు కలిపి మొత్తం 2,996 మంది సభ్యులను ఎన్నుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ మున్సిపాలిటీలలోని 12 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా... ఒక స్థానంలో పోలింగ్ వాయిదా పడింది. మక్తల్‌లోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప మృతి వల్ల అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దీంతో నేడు 2,569 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక, మున్సిపల్ కార్పొరేషన్‌ల విషయానికి వస్తే... రెండు వార్డులు ఏకగ్రీవం కాగా, ఈరోజు 412 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇక, ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నెల 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉపమేయర్లు, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల పదవులకు పరోక్ష పద్దతిలో ఎన్నికలు జరగనున్నాయి.