
సాక్షి డిజిటల్ న్యూస్ :ఐక్యంగా...బలంగా మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలి.ప్రతి ఒక్కరూ కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలి అని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. గత 20 నెలల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు వివరించారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని...ఇది శుభ పరిణామమని చెప్పిన సీఎం ఇదే ఐక్యత ఇకపైనా కొనసాగాలని, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇందుకు తగ్గట్టుగా మంచి పనులు చేసి ఎమ్మెల్యేలు పేరు తెచ్చుకోవాలన్నారు. మొన్నటి ఎన్నికల కంటే నేడు కూటమి బలం, ప్రజల మద్దతు మరింత పెరిగిందని... ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో పనిచేశామో, అదే స్ఫూర్తితో మున్ముందు పని చేయాలన్నారు.మూడు పార్టీలు ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి ఉండాలన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ శాసనసభా పక్ష ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్లో వరుసగా ఐదుసార్లు బీజేపీ గెలిచి అధికారంలో ఉందని, ఇదే స్ఫూర్తితో ఇక్కడా విజయాలు సొంతం చేసుకోవాలన్నారు. శాశ్వతంగా రాజకీయాల్లో నిలబడేలా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని సీఎం సూచించారు. ఈ 20 నెలల్లో చాలా కష్టపడి, ఐక్యంగా పని చేశామని సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ఐదేళ్ల ఏళ్ల విధ్వంసాన్ని అధిగమించి... ప్రగతి వైపు రాష్ట్రాన్ని తీసుకువెళుతున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుందని, ఐక్యంగా ముందుకు వెళతుందని డిప్యూటీ సీఎం చెప్పారు. ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో... భవిష్యత్‌లో అలాగే పని చేయాల్సి ఉంటుందన్నారు. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా కూర్చుని వాటిని పరిష్కరించుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. కూటమి ధర్మాన్నికి ప్రతి ఒక్కరం కట్టుబడి బడి పని చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. అర్థవంతమైన చర్చలు జరగాలి ‘జిల్లాల వారీగా ఎమ్మెల్యే, ఎంపీలు, ఎస్పీ, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తాం. పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగా ఎమ్మెల్యేల గౌరవాన్ని పెంచుతాం. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు గుర్తిస్తే ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేద్దాం. మనం చేసే అభివృద్ది కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయి’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘మనం ఇంకా పూర్తిగా కోలుకోలేదు... కానీ వ్యవస్థలను గాడిన పెట్టాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా నియోజకవర్గాల్లో చేసిన పనులను ఎమ్మెల్యేలు ఓన్ చేసుకోవాలి. అసెంబ్లీ సమావేశాలను సభ్యులు సీరియస్‌గా తీసుకోవాలి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యులు అంతా సభలో ఉండాల్సిందే. నేను కూడా సభను పూర్తిగా ఫాలో అవుతా... సభ్యుల ప్రసంగాలు, మంత్రులు సమాధానాలు వింటాను. సభలో సబ్జెక్టులపై అర్థవంతమైన చర్చలు జరగాలి. మా సమస్యలపై మా ఎమ్మెల్యేలు మాట్లాడారు, మంత్రులు సమాధానం చెప్పారు అని ప్రజలు అనుకోవాలి. విప్‌లు సంతృప్తికరంగా పని చేయాలి. ఎదుటివారు తిట్టారని మనం కూడా బూతులు తిట్టకూడదు. ప్రజల ఆమోదయోగ్యంగా సభ జరగాలి’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర సాయంతోనే ఇంతటి పురోగతి ‘నాడు ఎన్నికల్లో చెప్పిన అన్ని పథకాలు ఇస్తున్నామంటే కేంద్రం ఎంతో సహకారం అందిస్తోంది. అందుకే వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టాం. కేంద్రం అమరావతి, పోలవరానికి డబ్బులు ఇవ్వకపోయి ఉంటే నేడు ఈ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యేవి కాదు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకిత చేస్తున్నామంటే కేంద్రం సాయం అందించడమే కారణం.