జనం న్యూస్: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వైసీపీ ఆరోపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వైసీపీ ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘరాం లేఖ రాశారు. ఆ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు వైఎస్ జగన్ వెళ్లిన సందర్భంలో తీవ్ర స్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని లేఖలో ఆరోపించారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వైఎస్ జగన్ ఇటీవల పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. సాధారణంగా కేవలం 22 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కనపెట్టి, విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 47 కిలో మీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ మార్గానికి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా రూట్ మ్యాప్ మార్చారని పేర్కొన్నారు. అధికారులు సూచించిన మార్గాన్నే అనుసరించినా, తిరుగు ప్రయాణంలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో ప్రస్తావించారు. భద్రతా బృందానికి గానీ, పార్టీ ప్రతినిధులకు గానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తిరుగు మార్గాన్ని అకస్మాత్తుగా మార్చారని ఆరోపించారు. తిరుగు ప్రయాణంలో వైఎస్ జగన్ ప్రయాణించిన మార్గం అత్యంత రద్దీగా ఉందని, ఈ మార్గం జెడ్ ప్లస్ కేటగిరీ వీవీఐపీకి ఏమాత్రం అనుకూలం కాదని తలశిల రఘురాం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధమైన అనూహ్య రూట్ మార్పులు భద్రతా ప్రొటోకాల్స్‌ను బలహీనపరుస్తాయని అన్నారు. ఇలాంటి చర్యలు వీవీఐపీ ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు భద్రతా అంచనా లేకుండా, రాతపూర్వక సమాచారం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదని, గతంలో కూడా వైఎస్ జగన్ భద్రతలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని లేఖలో ప్రస్తావించారు.