దేవరపల్లి ఆశ్రమ హాస్టల్‌లో విద్యార్థుల అస్వస్థత

★సీఎం చంద్రబాబు అత్యవసర స్పందన

సాక్షి డిజిటల్ న్యూస్ : పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్‌లో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్‌లో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆదివారం రోజున సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవరపల్లిలో గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఫిబ్రవరి 9వ తేదీ (సోమవారం) లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ.. 92 మంది విద్యార్ధులకు డయేరియా లక్షణాలు కనిపించటంతో వారిని హుటాహుటిన మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు వివరించారు. అందరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఆహార పదార్ధాల, నీటి నమూనాలు కూడా సేకరించామని తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ... విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందిపై జిల్లా కలెక్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంఓ) క్రమం తప్పకుండా తాజా సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే, మిగిలిన విద్యార్థులను పరీక్షించడానికి వసతి గృహంలో ఒక ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే ఆహారం, నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక, దేవరపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ బాలుర హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. వసతి గృహంలో ఆహారం తిన్న తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే చికిత్స కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పలువురు విద్యార్థులను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. విద్యార్థులకు సాధ్యమైనంత ఉత్తమ చికిత్స అందిస్తున్నామని, వారిని నిశితంగా వైద్య పర్యవేక్షణలో ఉంచామని ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రంపచోడవరం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ అధికారి బి స్మరణ రాజ్, స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి ఆసుపత్రికి చేరుకున్నారు. వారు ఆస్పత్రిలోనే ఉండి విద్యార్థులకు జరుగుతున్న వైద్య చికిత్సను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు.