శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

* సీఎం చంద్రబాబుకు దేవస్థానం ఆహ్వానం.

జనం న్యూస్: మహా శివరాత్రికి శ్రీశైలం దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీ ఏడాది నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈక్రమంలో ఈ శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆలయ చైర్మన్, బోర్డు సభ్యులు ఆహ్వానించారు. మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం ఇచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు సీఎంకు వివరించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే విధంగా మహానందిలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు. ఫిబ్రవరి 15న టిటిడి ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ మరోవైపు తిరుమల తిరుతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 06 గం.ల నుండి అర్థరాత్రి 12 గం.ల వరకు నిర్విరామంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా హెచ్‌డీపీపీ, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు జరుగనున్నాయి.పూర్వ కాలంలో మహాశివరాత్రి సందర్భంగా సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో భాగంగా భక్తులు ఆలయాలకు చేరుకుని రాత్రంతా భజనలు, హరికథలు తదితర భక్తి కార్యక్రమాలతో జాగరణ చేసేవారు. ప్రస్తుతం అదే పందాలో భక్తులను సంప్రదాయ పద్దతిలో భక్తి మార్గం వైపు నడిపించేందుకు తిరుపతిలోని సదరు కేంద్రాలలో భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి పరమ శివుని అనుగ్రహం పొందాలని కోరడమైనది. లింగోద్భవ సమయానంతరం భక్తాదులకందరికి ప్రసాద వితరణ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *