
సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై బీజేపీ అభ్యర్థిని కూర్చొబెట్టాలని... అప్పుడు పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల, కాగజ్‌నగర్‌లలో దేవేంద్ర ఫడ్నవీస్ పర్యటించారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన విజయ్ సంకల్ప్ సభ, మంచిర్యాలలో రోడ్ షోలో పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ వేదికలపై నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ప్రజల ఉత్సాహం స్పష్టం చేస్తుందని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు అక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం అందిచారని... ఇది నగరాల్లో వేగంగా అభివృద్ది పనులు జరిగేందుకు తోడ్పడుతుందని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే మార్పు కనిపిస్తుందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఊహించిన కలలు, అవకాశాలు... బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతితో చెదిరిపోయాయని ఆరోపించారు. ఒకప్పుడు రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి, పాలనలో పారదర్శకత, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య గోదావరి జలాల వివాదం ఉందని... 2015లో తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నానని, అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనను కలిసి గోదావరి జలాల అంశం మాట్లాడారని చెప్పారు. ఆ సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల విషయంలో ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తాను ఎటువంటి వివాదం లేకుండా తెలంగాణకు నీరు అందించాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇది మహారాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా పొరుగు రాష్ట్రాలు నదీ జలాలను ఉపయోగించుకోవడానికి అనుమతించాలనే తమ నిబద్ధతను చూపిస్తుంది అని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బెల్లంపల్లి-గడ్చిరోలి జాతీయ రహదారి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ, అమృత్ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల ద్వారా నగరాలకు భారీగా నిధులు అందిస్తుందని తెలిపారు. అయితే ఆ డబ్బు కేవలం బీజేపీ అధికారంలో ఉంటే మాత్రమే ప్రజలకు చేరుతుందని అన్నారు. ఇతర చోట్ల ఆ డబ్బులను సరైన రీతిలో వినియోగించడం లేదని ఆరోపించారు.అందుకే పట్టణాభివృద్ధి, పారదర్శక పాలన, మెరుగైన భవిష్యత్తు కోసం బీజేపీ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించాలని కోరారు. అలాగే, తాను మంచిర్యాలకు రావడం ఇది మొదటిసారి కాదని ఫడ్నవీస్ తెలిపారు. గతంలో చాలాసార్లు మంచిర్యాలకు వచ్చానని ఫడ్నవీస్ గుర్తుచేసుకున్నారు. తనకు ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారని తెలిపారు. తన కళాశాల రోజుల్లో తాను ఇక్కడి థియేటర్లలో సినిమాలు చూసేవాడినని చెప్పారు. మంచిర్యాల పట్టణంతో తనకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నారు.