సాక్షి డిజిటల్ న్యూస్: చెన్నై నగరంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇటీవల వందలాది కాకులు చనిపోగా… H5N1 వైరస్ వ్యాప్తి చెందినట్లుగా నిర్దారణ అయింది. చెన్నై నగరంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇటీవల వందలాది కాకులు చనిపోగా… H5N1 వైరస్ వ్యాప్తి చెందినట్లుగా నిర్దారణ అయింది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆరోగ్య అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రజలకు ఒక అడ్వైజరీ జారీ చేశారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి బయోసెక్యూరిటీ ప్రోటోకాల్‌ల ప్రకారం… కాకులు, కోళ్ల కళేబరాలను దహనం చేయాలని లేదా లోతుగా పూడ్చిపెట్టాలని అధికారులు ఆదేశించారు. చనిపోయిన పక్షులను తాకడం మానుకోవాలని ప్రజలకు సూచించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి గురించి ఏదైనా అనుమానాలు ఉంటే స్థానిక అధికారులకు వెంటనే తెలియజేయాలని కోరారు. అసలేం జరిగిందంటే… గత నెలలో చెన్నైలో వందలాది కాకులు అనుమానాస్పద స్థితిలో మరణించాయి. అడయార్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కాకుల మరణాల నేపథ్యంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. ఈ శాఖకు చెందిన జంతు వ్యాధుల విభాగం మరణించిన కాకుల నమూనాలను సేకరించింది. ఈ నమూనాలను భోపాల్‌లోని ICAR–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHAS) ప్రయోగశాలలో పరీక్షించగా బర్డ్ ఫ్లూ నిర్దారణ అయింది. అంతేకాకుండా ఈ నమూనాలలో అత్యంత వ్యాధికారక H5N1 స్ట్రెయిన్ నిర్దారణ అయింది. ఇది జూనోటిక్ సామర్థ్యాన్ని కలిగి ఉందని పరీక్షలు నిర్దారించాయి. అంటే ఇది అరుదైన సందర్భాల్లో జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. ‘‘పక్షుల నుంచి మానవులకు ఈ వైరస్ సంక్రమించడం చాలా అరుదు. మరణించిన పక్షుల్లో జీవించి ఉన్న వైరస్‌ను తాక, ఆపై నోరు లేదా కళ్ళు వంటి శరీర భాగాలను తాకిన సందర్భాలు తప్ప… చరిత్రలో ఇలాంటి కేసులు పెద్దగా నివేదించబడలేదు. భయపడాల్సిన అవసరం లేదు’’ అని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ ఎ సోమసుందరం తెలిపారు.