సోనియా గాంధీ త్యాగంతోనే తెలంగాణ సాధ్యం

★ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన మోసాలను, కాంగ్రెస్ తెచ్చిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ప్రాణాలకు తెగించి తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, 2004లో ఇదే జిల్లాలో సోనియా గాంధీ తెలంగాణ ప్రకటన చేశారని, ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలో పార్టీని సైతం పణంగా పెట్టారని గుర్తుచేశారు. మరోవైపు, జిల్లా పర్యటనలో భాగంగా మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపునకు డబ్బు కొలమానం కాదని, ప్రజల నమ్మకమే నిజమైన పెట్టుబడి అని దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లాలని సూచించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని, కాంగ్రెస్ తెచ్చిన మార్పును ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో సోనియా గాంధీ చూపిన తెగువను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నష్టపోతుందని తెలిసినా, కేంద్రంలో అధికారం కోల్పోయే ప్రమాదం ఉన్నా, ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ప్రకటించారని కొనియాడారు. ఆనాడు పెట్టుబడిదారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినా ఆమె చలించలేదని అన్నారు. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడులను సైతం లెక్కచేయకుండా పొన్నం ప్రభాకర్ వంటి నేతలు చేసిన పోరాటాన్ని, వారి త్యాగాలను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ కార్యకర్తలకు, అభ్యర్థులకు సీఎం నూతనోత్సాహాన్ని నింపారు. టికెట్ కోసం తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, పార్టీ అధిష్టానం నమ్మి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టికెట్ దక్కని నాయకులను కలుపుకొని పోవాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని స్పష్టం చేశారు. ఒక్క ఓటు కూడా ఫలితాన్ని తారుమారు చేస్తుందని, అందుకే అలసత్వం వద్దని హెచ్చరించారు. గత ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలే కాంగ్రెస్ విజయానికి నాంది అని తెలిపారు. మనం చేసిన పనులే ప్రజలకు చెప్పాలని, అబద్ధాలు ఆడాల్సిన అవసరం మనకు లేదని హితవు పలికారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలన కేవలం ఆస్తులు కూడబెట్టుకోవడానికే పరిమితమైందని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు గానీ, దళితులకు మూడు ఎకరాల భూమి గానీ ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన చరిత్ర కాంగ్రెస్‌దని గుర్తుచేశారు. ఉచిత విద్యుత్ పథకంపై పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదేనని, రైతులపై కేసులు ఎత్తివేసి, విద్యుత్ బకాయిలు రద్దు చేసిన ఘనత తమకే దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేక ప్రతిపక్షం విషం చిమ్ముతోందని మండిపడ్డారు.