
జనం న్యూస్: హైదరాబాద్ నగరాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ది కోసం తమ ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ₹20 వేల కోట్ల నిధులను కేటాయించినట్టుగా చెప్పారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ది కోసం తమ ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ₹20 వేల కోట్ల నిధులను కేటాయించినట్టుగా చెప్పారు. ఈ నిధులతో అనేక అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తికాగా, మరికొన్ని పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. హైటెక్స్‌లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ సమావేశంలో భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ అభివృద్ది కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రెండేళ్లలో జీహెచ్ఎంసి పరిధిలో ₹1,950.52 కోట్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పరిధిలో రూ. 12,500 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో రూ. 4,336.5 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. పెట్టుబడులు, ప్రతిభ, జీవన ప్రమాణాల్లో నాణ్యత విషయంలో హైదరాబాద్ దేశంలోని నగరాలతోనే కాక ప్రపంచంలోని అగ్ర నగరాలతో పోటీ పడుతోందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. ఈ నిర్ణయంతో పౌర సేవలు, సమగ్ర ప్రణాళిక, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో సమాన అభివృద్ధి దృక్పథం సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఈ రోజు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని అన్నారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనుకూల నగరాలలో ఒకటిగా నిలవడం యాదృచ్ఛికం కాదని. దశాబ్దాల సంస్థాగత నిర్మాణం, ప్రజాస్వామ్య పాలన, సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వ నిబద్ధత ఫలితమని తెలిపారు. గత నాయకత్వం వేసిన పునాదులపై ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకత, బాధ్యతాయుత పాలనతో మరింతగా బలపరుస్తోందని చెప్పారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాం (H-CITI) కిందరూ. 7,032 కోట్ల పెట్టుబడితో 45 ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, 10 రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని చెప్పారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు రూ. 1,090 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వెస్ట్ కారిడార్‌లో ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ ప్రాంతాల్లో రూ. 837 కోట్లతో మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు, వెస్ట్రన్ సిటీలో రూ. 70 కోట్లతో రోడ్ల విస్తరణ జరుగుతున్నాయని చెప్పారు. ఉత్తర ప్రాంతంలో రూ. 960 కోట్లతో ప్రత్యామ్నాయ రహదారి నెట్‌వర్క్‌లు, తూర్పు హైదరాబాద్‌లో రూ. 416 కోట్లతో కనెక్టివిటీ పనులు, దక్షిణ ప్రాంతంలో రూ. 863 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.ఈ పెట్టుబడులు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా లాజిస్టిక్స్ మెరుగుపరచడం, ఆర్థిక కార్యకలాపాల బలోపేతం, భూవిలువల పెరుగుదలకు దోహదపడతాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, కార్మికులు, వ్యాపారవేత్తలు, కుటుంబాల రోజువారీ జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయని అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047 కింద క్యూర్, ప్యూర్, రేర్ వ్యూహంతో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీని అభివృద్ధి కేంద్రంగా నిలుపుతున్నామని తెలిపారు. వరద భద్రత, వాతావరణ అనుకూలత కోసం లోతట్టు ప్రాంతాలకు ఉపయోగపడే సమగ్ర స్మార్ట్ వాటర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. యూఎంటీఏ ద్వారా స్పేషియల్ మాస్టర్ ప్లాన్, బ్లూ-గ్రీన్ మాస్టర్ ప్లాన్, సమగ్ర మొబిలిటీ ప్రణాళికలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గ్రీన్ బిల్డింగ్స్, బాధ్యతాయుత పట్టణ రూపకల్పనను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, పౌరులు కలిసి రాజ్యాంగ విలువల మార్గనిర్దేశంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.