
సాక్షి డిజిటల్ న్యూస్: అమెరికా- భారత్‌ల మధ్య ఇటీవల వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఏడాదిపాటు ఈ డీల్‌పై ఇరు దేశాలూ చర్చించాయి. అయితే, ఈ క్రమంలో భారత్‌ను భయపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకోవాలని ట్రంప్ భావించారు. కానీ, తాము భయపడబోమని, ఎన్నాళ్లయినా వేచి చూస్తామని ఉన్నతస్థాయి ప్రతినిధుల మధ్య జరిగిన కీలక భేటీలో భారత్ తేల్చి చెప్పింది. గత ఏడాది సెప్టెంబరు ప్రారంభంలో అజిత్ దోవల్, అమెరికా విదేశాంగ మంత్రి మధ్య కీలక భేటీ జరిగింది. అగ్రరాజ్యం అమెరికా- భారత్‌ల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఈ వారం వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే, ఈ డీల్‌కు ముందు ఇరుదేశాలకు ఉన్నతస్థాయి ప్రతినిధుల మధ్య జరిగిన కీలక భేటీకి సంబంధించిన ఓ వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. వాణిజ్య ఒప్పందం కోసం అవసరమైతే డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తామని భారత్ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం వెలువరించింది దీంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం.. గతేడాది సెప్టెంబరు మొదట్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మధ్య సమావేశం జరిగింది. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సహా వైట్‌హౌస్ అధికారులు పలువురు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం, సుంకాల విషయంలో పలుసార్లు బెదిరింపులకు దిగిన సంగతి కూడా తెలిసిందే. అయితే, రూబియోతో భేటీలో భారత్ తన వైఖరిని కుండబద్దలుకొట్టడమే కాదు, అమెరికాకు చురకలు అంటించింది.