భారత్ – అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం

★ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్.

జనం న్యూస్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌కు గుడ్ న్యూస్ తెలిపారు.భారతీయ ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్-అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికరంగా స్పందించారు. ప్రపంచ ఆర్ధిక స్థిరత్వానికి ఇది ఓ చారిత్రాత్మక ఘట్టం అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమెరికాతో చారిత్రక వాణిజ్య ఒప్పందం చేసుకోవటంపై ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. సుంకాలను 18% శాతానికి తగ్గించడం ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిరంతరం ప్రపంచ వృద్ధిని కాంక్షించేలా ఈ దార్శనిక నిర్ణయం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. భారత్ ప్రపంచ ఆర్థిక శక్తికి కేంద్రం. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచ ఆర్థికశక్తి కేంద్రంగా తన పాత్రను సుస్థిరం చేసుకుంటోందని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.భారత ఎగుమతుల్లో పోటీ తత్వాన్ని గణనీయంగా పెంచేలా ఒప్పందం ఉందని ట్వీట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం ఏపీ సహా దేశ యువత, రైతులకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. 18 శాతానికి తగ్గిన సుంకం. ఇకపోతే భారత్‌ - అమెరికా బిజినెస్‌ డీల్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు.వాణిజ్య ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోడీతో చర్చించినట్లు చెప్పిన కొద్ది సేపటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను 25 శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌పై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ‘భారతదేశంలో తయారు చేయబడిన’ఉత్పత్తులపై ఇప్పుడు 18 శాతం తగ్గిన సుంకం ఉంటుందని అన్నారు. ఈ అద్భుతమైన ప్రకటనకు 1.4 బిలియన్ల భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్‌కు చాలా ధన్యవాదాలు అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారత్‌కు మరింత ప్రయోజనాలు. ట్రంప్‌ టారిఫ్‌లు తగ్గిస్తున్నట్లు చేసిన ప్రకటనను భారతీయ వ్యాపారులు స్వాగతించారు. ఈ నిర్ణయం భారతీయ వ్యాపారులకు లాభదాయకం అని తెలుస్తోంది. ఎగుమతులు పెరిగే అవకాశంతోపాటు ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు వాణిజ్య ఒప్పందం రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని రెట్టింపు చేయవచ్చు.భారత-అమెరికా బంధాలను బలోపేతం చేస్తుంది. రష్యన్ చమురు ఆధారాలను తగ్గించి అమెరికా వైపు మళ్లించడం భారత్ శక్తి భద్రతను మెరుగుపరుస్తుంది.ఈ నిర్ణయం ట్రేడ్ వార్ భయాలను తగ్గించి. రెండు దేశాల ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. భవిష్యత్తులో మరిన్ని ఒప్పందాలు ఆశాకిరణాలు కల్పిస్తున్నాయి అని భారతీయ వ్యాపారులు ఆకాంక్షిస్తున్నారు.