
సాక్షి డిజిటల్ న్యూస్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రోజున లోక్‌సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి చరిత్రలో రికార్డు స్థాయిలో కేంద్రం కేటాయింపులు జరిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రోజున లోక్‌సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి చరిత్రలో రికార్డు స్థాయిలో కేంద్రం కేటాయింపులు జరిపింది. ఆపరేషన్ సిందూర్‌కు అనంతర పరిణామాల నేపథ్యంలో... కేంద్ర బడ్జెట్‌లో రక్షణ సేవలకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 7.85 లక్షల కోట్లు కేటాయించింది. ఈ స్థాయి కేటాయింపు... 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలతో పోలిస్తే 15.19 శాతం గణనీయమైన పెరుగుదలను చూపుతోంది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన జీడీపీలో 2 శాతంగా ఉంది. మొత్తం రక్షణ రంగ బడ్జెట్... కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 14.67 శాతంగా ఉంది. అలాగే ఇది అన్ని మంత్రిత్వ శాఖలలోకెల్లా అత్యధికం. ఇందులో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకునేందుకు భారీగా కేటాయింపులు ఉన్నాయి. అయితే ఈ స్థాయి కేటాయింపులు భారత్‌పై కుట్రపూరితంగా వ్యవహరించే దాయాది పాకిస్తాన్‌కు వెన్నులో వణుకే అని చెప్పాలి. అయితే రక్షణ రంగ కేటాయింపులు... సాయుధ దళాల ఆధునీకరణ, సాధారణ అవసరాలకు నిధులు సమకూర్చనున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత క్యాపిటల్, రెవెన్యూ అనే రెండు విభాగాల కింద ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అత్యవసరంగా కొనుగోలు చేయడం వల్ల తలెత్తిన ఆర్థిక అవసరాలను కూడా తీరుస్తుంది. రక్షణ బడ్జెట్‌లో రూ. 2.19 లక్షల కోట్ల పెద్ద వాటాను మూలధన వ్యయం కోసం కేటాయించారు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ అంచనాలైన రూ. 1.80 లక్షల కోట్ల కంటే ఎక్కువ. ఈ పెంపు ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం వైపు వ్యూహాత్మక మార్పుతో సాయుధ దళాలను, వాటి సామర్థ్యాలను ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలకు తీర్చిదిద్దాలనే తన సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చేసిన మొత్తం కేటాయింపులో... 27.95 శాతం మూలధన వ్యయం కోసం, 20.17 శాతం నిర్వహణ, కార్యాచరణ సంసిద్ధతపై రెవెన్యూ వ్యయం కోసం, 26.40 శాతం జీతాలు, భత్యాలపై రెవెన్యూ వ్యయం కోసం, 21.84 శాతం రక్షణ పెన్షన్ల కోసం, 3.64 శాతం పౌర సంస్థల కోసం ఉన్నాయి. సాయుధ దళాల ఆధునీకరణ... వ్యూహాత్మక లక్ష్యం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రక్షణ దళాలకు మూలధన విభాగం కింద బడ్జెట్ కేటాయింపు రూ. 2,19,306.47 కోట్లుగా ఉంది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల కంటే 21.84 శాతం ఎక్కువ. ఇందులో రూ. 1.85 లక్షల కోట్లు మూలధన సేకరణ కోసం కేటాయించబడింది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరానికి మూలధన సేకరణ బడ్జెట్ కంటే సుమారు 24 శాతం ఎక్కువ. ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులలో... ఆధునీకరణ బడ్జెట్‌లో ఈ భారీ పెరుగుదల ఒక వ్యూహాత్మక అవసరంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం వరకు అంటే డిసెంబర్ 2025 వరకు... రక్షణ మంత్రిత్వ శాఖ రూ. 2.10 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పటివరకు రూ. 3.50 లక్షల కోట్లకు పైగా అవసరాల ఆమోదాన్ని ఇచ్చింది. మూలధన సేకరణ కింద రాబోయే ప్రాజెక్టులు సాయుధ దళాలకు నెక్ట్స్ జనరేషన్ యుద్ధ విమానాలు, స్మార్ట్, లెథల్ ఆయుధాలు, నౌకలు/జలాంతర్గాములు, మానవరహిత వైమానిక వాహనాలు, డ్రోన్లు, ప్రత్యేక వాహనాలు మొదలైన వాటిని సమకూర్చనున్నాయి. గ్లోబల్ సప్లై చైన్‌లలో ఏర్పడుతున్న అంతరాయాలు, విదేశీ విక్రేతల కంటే దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా... కేవలం మనుగడ కోసమే కాకుండా భవిష్యత్ ఆధునీకరణ కోసం రక్షణ రంగంలో 'దేశీయకరణ','దిగుమతుల ప్రత్యామ్నాయం' పై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. బడ్జెట్ విధానాల ద్వారా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడానికి నిధులను కేటాయించే రక్షణ మంత్రిత్వ శాఖ విధానం మరింత బలోపేతం చేయబడింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశీయ పరిశ్రమల ద్వారా సేకరణ కోసం మూలధన సేకరణ బడ్జెట్‌లో 75 శాతం అంటే రూ. 1.39 లక్షల కోట్లను కేటాయించారు. ఈ విధంగా నిధులు కేటాయించడం ద్వారా దేశీయ సంస్థలకు వారి పెట్టుబడుల గురించి, సాయుధ దళాల సామర్థ్య అభివృద్ధిలో వారి పెరుగుతున్న పాత్ర గురించి భరోసా లభించింది. మూలధన సేకరణకు, ముఖ్యంగా దేశీయ పరిశ్రమలకు కేటాయింపులను పెంచడం జాతీయ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అనేక అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దారితీసి... దేశంలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది.