
సాక్షి డిజిటల్ న్యూస్ : కేంద్ర బడ్జెట్ 2026-27పై తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ 2026-27పై తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించిందని విమర్శించారు. భట్టి విక్రమార్క ఆదివారం రోజున ప్రజాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... నేడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. కేంద్ర బడ్జెట్ 2026-27లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని ఆశించామని... కానీ బడ్జెట్‌లో తెలంగాణకు ఏమి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమ మంత్రివర్గ సభ్యులు అనేక సందర్భాల్లో స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు పదేపదే విజ్ఞప్తులు సమర్పించినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో సహా జీహెచ్‌ఎంసీల పరిధిలో పలు ప్రతిపాది అభివృద్ది ప్రాజెక్టులకు సాయం కోరామని... రీజినల్ రింగ్ రోడ్ కోసం నిధులు అడిగామని... మెట్రో రైలు కోసం కేటాయింపులు ఉంటాయని ఆశించామని... కానీ ఏది జరగలేదని అన్నారు. కేంద్రం రూ. 10 వేల కోట్ల బయోఫార్మా శక్తి పథకాన్ని ప్రకటించిందని... అందులో తెలంగాణను గుర్తించలేదని అసంతృపత్తి వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో భారత్ బయోటెక్ ద్వారా ప్రపంచానికే ప్రాణవాయువునిచ్చిన హైదరాబాద్ నగరాన్ని ఫార్మా హబ్ కేటాయింపుల్లో విస్మరించడం అన్యాయమని అన్నారు. ఫార్మా రంగం అంటే హైదరాబాద్ గుర్తుకు వస్తుందని... జీనోమ్ వ్యాలీ వంటి ఎకోసిస్టమ్ ఉందని... అయినప్పటికీ తెలంగాణ పేరును పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అయినా నగరాన్ని విస్మరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ పార్క్ రాష్ట్రానికి కేటాయించాలని అనేక సార్లు కేంద్రాన్ని కోరామని గుర్తు చేశారు. సెమీ కండక్టర్ పార్క్ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్న హైదరాబాద్‌ను పక్కన బెట్టారని అన్నారు. తమ విన్నపాన్ని తోసిపుచ్చి, ఇతర రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వడం రాష్ట్ర యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీయడమే.