
సాక్షి డిజిటల్ న్యూస్: కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.7,684 కోట్ల పెట్టుబడితో 21 పరిశ్రమల ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆరుకొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ఎంవోయూలు చేసుకున్నట్లు సీఎ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంఓయూ చేసుకుంటే అది ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా పూర్తి అయ్యేందుకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు.స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలోనే అనుమతులు మంజూరు చేసి ప్రాజెక్టు సాకారమయ్యేలా చూస్తామని పారిశ్రామిక వేత్తలకు సీఎం భరోసా ఇచ్చారు. శనివారం కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని పరిశ్రమల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. యూనిట్లను ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించారు. కుప్పంలో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న పరిశ్రమల పురోగతి తదితర అంశాల గురించి చర్చించారు. సరైన సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే అందరికీ ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పంలో రూ.7684 కోట్ల పెట్టుబడులు ప్రాజెక్టు ఆలస్యమైతే అందరికీ నష్టమేనని.. పెట్టుబడి వ్యయం పెరగటంతో పాటు వయబిలిటీ అంశంలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడుఅన్నారు. నిర్దేశిత గడువులోగానే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని పారిశ్రామిక వేత్తలకు సూచించారు. కుప్పంలో రూ.7684 కోట్ల విలువైన పెట్టుబడులతో 21 పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయని ఆయన తెలిపారు. వీటి ద్వారా 35,545 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 44,584 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టంను తయారు చేశామని.. పెట్టుబడులకు అత్యుత్తమ ప్రాంతంగా మారిందని అన్నారు. తయారైన ఉత్పత్తుల రవాణాకు వీలుగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలు కూడా అతి దగ్గరగానే ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతీ ఇంటిపైనా విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు కుప్పం నుంచి వివిధ ప్రాంతాలను కలిపేలా మంచి రహదారి నెట్వర్క్ ఉందన్నారు. కృష్ణగిరి-పలమనేరు, చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారులతో పాటు కొత్తగా బెంగుళూరు నుంచి కేజీఎఫ్ మీదుగా చెన్నైకి మరో రహదారి రానుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రైలు కనెక్టివిటీ కూడా ఈ ప్రాంతానికి ఉందని వివరించారు. చిత్తూరు- కుప్పం మధ్య కొత్త రైలు మార్గం ప్రతిపాదన కూడా ఉందన్నారు. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులను కూడా లింక్ చేస్తామని త్వరలోనే విమానాశ్రయ నిర్మాణం కూడా చేపడతామని సీఎం తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నీటి సరఫరా జరిగేలా హంద్రీనీవా కాలువలు ఉన్నాయని అన్నారు. నియోజకవర్గంలో ప్రతీ ఇంటిపైనా ప్రతీ పొలంలోనూ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.