ఏపీలో విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ ప్రకటన

జనం న్యూస్: విద్యుత్ శాఖలోని ఖాళీలపై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. త్వరలోనే 500 ఏఈ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యుత్ శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు.విద్యుత్ శాఖలో ఏఈల కొరత ఉన్నదని రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి 500 ఏఈ పోస్టును భర్తీ చేయడం జరుగుతుందని ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 33 వేల కోట్ల రూపాయల మేర సామాజిక పింఛన్లు అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 16, 300 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు మెగా డీఎస్సీ ద్వారా నియమించడం జరిగిందన్నారు. దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మ బడి ద్వారా చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులకు నగదు వంటి అనేక కార్యక్రమాలు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా అన్నిటిని నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. పోలీసు శాఖలో 6000 ఉద్యోగాల నియామకాన్ని చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రైతుల దరఖాస్తు చేసుకున్న వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలి. రైతులు వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలనిఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్‌లోని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలతో కలిసి ఆయన జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న వివిధ విద్యుత్ ప్రాజెక్టులు మరియు ఆర్డీఎస్ఎస్ (RDSS) పనుల పురోగతి అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పనులను మరింత వేగవంతం చేసి మార్చి నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ పనులలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలను పాటించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. సౌర విద్యుత్‌పై అపోహలు తొలగించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సూర్యఘర్‌ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. పీఎం సూర్యఘర్‌ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి సౌర విద్యుత్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత విద్యుత్ ఉద్యోగులపై ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.స్మార్ట్ మీటర్లపై ప్రజలకు సరైన సమాచారం అందించి వారిలో నమ్మకాన్ని కలిగించాలని పేర్కొన్నారు. ట్రాన్స్ ఫార్మర్ల దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.భవిష్యత్తులో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి విద్యుత్ కొరత లేకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను కోరారు. వినియోగదారులకు వంద శాతం సంతృప్తి కలిగేలా విద్యుత్ శాఖ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బందిని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *