
సాక్షి డిజిటల్ న్యూస్ : మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్దమైంది. అయితే మేడారం మహా జాతర 2026 వేళ... సమ్మక్క-సారలమ్మల చరిత్ర, ఎప్పటి నుంచి ఈ గిరిజన జాతర జరుపుకుంటున్నారు?, జాతర నేపథ్యం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం... మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్దమైంది. ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు మేడారం మహా జాతర వైభవంగా సాగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అయితే జాతర సమయంలో భారీగా భక్తులు రద్దీ ఉండనుండగా... ఇప్పటికే లక్షలాది మంది మేడారం వచ్చి సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. మేడారం మహాజాతరలో కీలకమైన నాలుగు రోజులు లక్షలాదిగా భక్తులు తరలిరానుండగా... వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం జారతను 8 జోన్లు, 42 సెక్టర్లుగా విభజించి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 21 శాఖలకు చెందిన 42,027 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బందిని మేడారం విధుల్లో మోహరించింది. మేడారం జాతర ముగిసేవరకు ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. జాతరలో 13వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అలాగే భక్తుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి 4 వేల ప్రత్యేక బస్సులను మేడారంకు నడపనుంది. మొత్తంగా 20 లక్షల మంది భక్తులను సురక్షితంగా జాతరకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రచించింది. అయితే మేడారం మహా జాతర 2026 వేళ... సమ్మక్క-సారలమ్మల చరిత్ర, ఎప్పటి నుంచి ఈ గిరిజన జాతర జరుపు కుంటున్నారు?, జాతర నేపథ్యం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం... ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క - సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పెరుగాంచింది. ఈ జాతరలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మలు పూజలు అందుకుంటారు. సమ్మక్క దేవతకు సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. ఒక గిరిజన కథ ప్రకారం... 13వ శతాబ్దంలో కాకతీయుల పాలన కాలంలో జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవారు. అయితే వేటకు వెళ్లిన కొంతమంది గిరిజన నాయకులు పులుల మధ్య అపారమైన కాంతిని వెదజల్లుతున్న శిశువు(సమ్మక్క)ను కనుగొన్నారు. ఆమెను వారి నివాసానికి తీసుకెళ్లారు. తెగ అధిపతి మేడరాజు ఆమెను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశారు. ఆమె ఈ ప్రాంతంలోని గిరిజనులకు రక్షకురాలిగా మారారు. ఆమెను మేడా రాజు తన మేనల్లుడు, కాకతీయుల సామంత రాజు, మేడారం పాలకుడు అయిన పగిడిద్ద రాజును వివాహం చేసుకున్నారు. సమ్మక్క-పగిడిద్ద రాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు... జంపన్న అనే ఒక కుమారుడు జన్మించారు. అయితే కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తారు. ఈ క్రమంలోనే దాడికి తట్టుకోలేక మేడరాజు.. మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటారు .అయితే కొన్నేళ్లకు వరుసగా కరువులు రావడంతో మేడారం పాలకుడైన పగిడిద్ద రాజు... కాకతీయ రాజులకు కప్పం చెల్లించలేకపోయారు. పగిడిద్ద రాజు కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం... వంటి కారణాలతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన ప్రధాన సేనాని, మంత్రి అయిన యుగంధరుడు నాయకత్వంలో మేడారంపై యుద్దానికి సైన్యాన్ని పంపారు. దీంతో మేడారం రాజ్యంను రక్షించుకోవడానికి పగిడిద్ద రాజు, గోవిందరాజు (సారలమ్మ భర్త), జంపన్న, మేడా రాజు, సమ్మక్క, సారలమ్మలు పలు దిక్కుల నుంచి కాకతీయులను ఎదుర్కొన్నారు. . అయితే పెద్ద సంఖ్యలో ఉన్న కాకతీయ సైన్యం దాడిని తట్టుకోవడం కష్టంగా మారింది. అయితే పగిడిద్ద రాజు, గోవింద రాజు, మేడరాజు, సారలమ్మలు కాకతీయ సైన్యం చేతిలో వీరమరణం పొందారు. అయితే తాము పరాజయం పొందుతున్నామనే వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ది చెందింది. అయితే సమ్మక్క కాళీ మాతలా విజృంభించి శత్రువులపై దండెత్తారు. అయితే కాకతీయులపై వీరోచితంగా పోరాడుతున్న సమ్మక్కను ఓ సైనికుడు వెన్నుపోటు పోడిచాడు. అయినప్పటికీ సమ్మక్క రక్తం కారుతున్న యుద్దం చేస్తూనే ఉంది. చివరకు ఈశాన్యం వైపున ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమయ్యారు. సమ్మక్కని వెతుక్కుంటూ వెళ్లిన కోయలకు ఒక పెద్ద నమిలినార చెట్టు కింద కుంకుమ భరణి కనిపించింది. ఆ కుంకుమ భరణి సమ్మక్కకు గుర్తుగా భావించి ఆమె రాక కోసం గిరిజనులంతా ఎదురు చూశారు. అయితే అక్కడ రెండు గద్దెలు కట్టి.. రెండేళ్ల కోసారి ఉత్సవం జరిపిస్తే.. వారి కోరికలను నెరవేరేస్తానని ఆకాశవాణి ద్వారా వినిపించిందని చెబుతారు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి రెండేళ్లకోకసారి మాఘ శుద్ధ పౌర్ణమి వేళ సమ్మక్క-సారలమ్మల జాతర నిర్వహిస్తూ వస్తున్నారు. మరోవైపు ప్రతాపరుద్రుడు కూడా సమ్మక్క భక్తుడిగా మారిపోయాడని చెబుతారు. ఆ తర్వాత మేడారం ప్రజల కప్పం రద్దుచేస్తారు. ఎటువంటి విగ్రహం లేకుండానే.. కుంకుమ భరిణినే సమ్మక్కగా భావించి జాతర రుపుకుంటున్నారు. నాలుగు రోజులపాటు ఈ జాతర ఎంతో వైభవంగా కోలాహలంగా జరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో మధ్య ఏడాది మినీ మేడారం జాతరను నిర్వహిస్తున్నారు. ఇక, మినీ మేడారం జాతర సమమయంలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. అయితే గద్దెల వద్ద పూజరులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక, ఈ ఏడాది మేడారం మహాజాతర జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. జనవరి 28న(బుధవారం) సాయంత్రం సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెలపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజైన జనవరి 28 (గురువారం)న సమ్మక్క అమ్మవారు గద్దెల మీదకు చేరుకుంటారు. జనవరి 30న (శుక్రవారం) సమ్మక్క- సారలమ్మ అమ్మవార్లు గద్దెల మీద ఉంటారు. ఈ సమయంలో భక్తులు మొక్కులు చెల్లించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తారు. జనవరి 31న (శనివారం) సాయంత్రం 6 గంటల సమయంలో దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.