
సాక్షి డిజిటల్ న్యూస్ : ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న భారీ టారిఫ్‌లు, డెడ్ ఎకానమీ వంటి ఘాటైన వ్యాఖ్యలను భారత్ తనదైన దౌత్య వ్యూహంతో తిప్పికొడుతోంది. ఆంక్షలతో భారత్‌ను భయపెట్టాలని అమెరికా చూస్తున్నా.. లొంగకుండా యూరోపియన్ యూనియన్‌తో మదర్ ఆఫ్ డీల్స్ వంటి చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటూ ప్రత్యామ్నాయ మార్కెట్లను సృష్టించుకుంటోంది. యూకే, కెనడా, రష్యా వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ.. అమెరికా ఆధిపత్యానికి తలొగ్గకుండా భారత్ కీలక శక్తిగా ఎదుగుతోంది. వాషింగ్టన్ తీరుతో విసిగిపోయిన దేశాలకు భారత్ ఇప్పుడు ఆశాకిరణంగా కనిపిస్తోంది. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు భారత ప్రధాని మోదీతో మంచి స్నేహ సంబంధాలను నెరిపారు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్ అసలు స్వరూపం బయటకు రావడం మొదలైంది. ఆపరేషన్ సింధూర్‌ను తానే ఆపానని ట్రంప్ పదే పదే చెప్పుకున్నారు. భారత్ ఖండించినప్పటికీ అమెరికా అధ్యక్షుడి తీరు మారలేదు. అంతే కాదు పాకిస్థాన్‌తో దోస్తీ చేస్తూ.. భారత్‌పై టారిఫ్‌ల బాంబు వేశారు ట్రంప్. అంతే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమ మాట వినకపోతే భారత్‌కు భవిష్యత్తు లేదనేది ట్రంప్ మాటల ఉద్దేశం. ఇక అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ అయితే.. ‘చూస్తుండండీ, రెండు నెలల్లో ఇండియా మాకు సారీ చెప్పి వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలుపెడదామని కోరుతుంది’ అని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడారు. భారత్ సంయమనంతో వ్యవహరిస్తూ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. ట్రంప్, జేడీ వాన్స్ కారణంగా ఒప్పందం పూర్తి కావడం లేదంటూ అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది.తమతో ట్రేడ్ డీల్ చేసుకోవడం మినహా భారత్‌కు మరో దారి లేదని అమెరికా భావించింది. టారిఫ్‌లతో భయపెట్టాలని చూసింది. కానీ భారత్ వెనక్కి తగ్గలేదు. 50 శాతం టారిఫ్‌లు విధించినా సరే, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతున్నా సరే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమేమీ కనిపించలేదు. అంతే కాదు అమెరికా నేతలు మాటలతో కవ్విస్తుంటే.. భారత్ మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. అమెరికా పాలకుల వైఖరి అర్థమైన తర్వాత భారత్ తనదైన ఆట మొదలుపెట్టింది.