సాక్షి డిజిటల్ న్యూస్ : తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నాయకులు ఎవరూ కేడర్‌ను విస్మరించవద్దు అని సూచించారు.పార్టీ కంటే ఏదీ ముఖ్యంకాదు… ఎవరు నిర్లక్ష్యం వహించినా పక్కనపెడతా అని హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతానికి అంతా కట్టుబడి పనిచేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. తెలుగుదేశం పార్టీ మరింత సమర్థవంతంగా పనిచేసేలా బలోపేతం కావాలి అంటే పార్టీలో యువతకు అత్యధిక ప్రాధాన్యంత ఇస్తున్నట్లు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీల వర్క్ షాప్ జరిగింది.‘ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎనభై శాతం మంది కొత్తవారికి, చదువుకున్న వారికి ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించాం. దేశంలోనే యంగ్ పార్లమెంట్‌గా టీడీపీ ఉంది.సమర్థులకు పెద్ద పీట వేశాం. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాం.పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు పార్టీ అధ్యక్షులు, సెక్రటరీలు సమన్వయం చేసుకోవాలి. పార్టీ కార్యక్రమాలు ఎవరు బాగా నిర్వహిస్తున్నారో నివేదికలు తెప్పిస్తాం. పొలిటికల్ గవర్నెన్స్ లో పార్లమెంట్ కమిటీ కీలకం. పార్లమెంట్ పరిధిలో చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పార్లమెంట్ అధ్యక్షులతో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి సమన్వయం చేసుకోవాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. కూటమి మరింత బలోపేతమైంది ‘పార్టీలో ఎవరికి ఏ పదవిచ్చినా కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటున్నాం. మీరు సమర్థవంతమైన నాయకులుగా తయారవ్వడానికి ఇదొక వేదిక. పార్లమెంట్ అధ్యక్షులకు పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుంది. మంత్రులు కూడా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులతో సమన్వయం కావాలి.’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. 2024లో ఎన్నికల్లో కూటమికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకు పదిఓట్లు అదనంగా రావాలి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 ఎన్నికలకంటే కూటమి మరింత బలోపేతమైంది. ఎన్నికలప్పుడే ప్రజల వద్దకు వెళ్లడం కాదు… ప్రభుత్వం చేసే కార్యక్రమాలను వివరిచేందుకు వారితో మమేకం కావాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం ‘పార్టీ కంటే ఏదీ ముఖ్యంకాదు..ఎవరు నిర్లక్ష్యం వహించినా పక్కనబెడతా. పార్టీ సిద్ధాంతానికి అందరూ కట్టుబడి పని చేయాలి. వచ్చిన అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత నాయకత్వం, శ్రేణులపై ఉంది. పార్టీలో కార్యకర్తే…అధినేత. ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగినప్పుడే నాయకులుగా మీరు, పార్టీ శాశ్వతంగా ఉంటుంది. టీడీపీ ఒక కుటంబం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘గత ప్రభుత్వంలో కార్యకర్తలు కష్టాలు పడ్డారు..ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పసుపు జెండా కోసం రక్తం చిందించారు. అనేక త్యాగాలు చేశారు. ఏ పని జరిగినా కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి.. .కార్యకర్తల ద్వారానే జరగాలి. సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.