
పయనించే సూర్యుడు న్యూస్ : తెలుగుదేశం పార్టీ వర్క్ షాప్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాన్య కార్యకర్తగా చివర వరుసలో కూర్చోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏకంగా నాలుగోసారి సీఎం అయినప్పటీకీ ఎలాంటి గర్వం లేకుండా సాధారణ కార్యకర్తలా కూర్చుని వర్క్ షాపులో భాగస్వాములవ్వడం అందర్నీ ఆకట్టుకుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్లో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగిస్తుంటే సీఎం చంద్రబాబు నాయుడు ఒక సాధారణ కార్యకర్తలా పాల్గొన్నారు. 25 పార్లమెంట్ కమిటీలకు చెందిన 1050 మంది కమిటీ సభ్యులతో కలిసి వర్క్ షాప్లో పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేతలతో కమిటీల్లోని సభ్యులకు శిక్షణ తరగతులను పార్టీ అధిష్టానం నిర్వహించింది. అయితే పార్టీ వర్క్ షాప్లో సాధారణ కార్యకర్తలా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని శిక్షణా శిబిరాల్లో భాగస్వామి అయ్యారు. వర్క్ షాప్ జరుగుతున్న గదుల్లోకి వెళ్లి చివరి సీట్లో కూర్చుని శిక్షణ తరగతులను సీఎం చంద్రబాబు నాయుడు ఫాలో అయ్యారు. సామాన్య కార్యకర్తగా సీఎం చంద్రబాబు నూతనంగా ఎంపికైన పార్లమెంట్ అధ్యక్షులకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నిర్వహించిన శిక్షణ తరగతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పార్టీ అధినేతగా, 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నా పార్టీ కార్యక్రమంలో మాత్రం సామాన్య కార్యకర్తగా చంద్రబాబు నాయుడు మారిపోయారు. నాయుకులు చెప్పేది శ్రద్దగా విని....వర్క్ షాప్ జరుగుతున్న విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. వర్క్ షాప్ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉంటూ ప్రతి రూంలోకి వెళ్లి వర్క్ షాప్ లోని అన్ని బృందాల సభ్యులతో చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. సామాన్య కార్యకర్తగా చంద్రబాబు ఒదిగిపోయిన విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడ్డారు. వర్క్ షాప్లో పాల్గొన్న 1050 మంది నేతలు టీడీపీ పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్లో నాలుగున్నర దశాబ్దాల పార్టీ ప్రయాణం, పార్టీ ఐడియాలజీ, క్యాడర్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు ప్రాధాన్యం వంటి అంశాలపై వర్క్ షాప్ జరిగింది. కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, విజన్ ప్రణాళికలు, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై జరిగిన వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఒక్కో పార్లమెంట్ కమిటీలో 42 మంది సభ్యులు చొప్పున మొత్తం 25 పార్లమెంట్లకు కలిపి 1050 మంది వర్క్ షాప్లో పాల్గొన్నారు. పార్టీ వర్క్ షాప్లో పాల్గొన్న ముఖ్యమంత్రి పార్టీ విధానాలు, ఆలోచనలు, సిద్దాంతాలపై నాయకులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ ఆలోచనలు వివరించారు. కార్యకర్తే అధినేత అనే పార్టీ సిద్దాంతానికి కట్టుబడి అంతా పని చేయాలని సిఎం చంద్రబాబు నాయకుల సూచించారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉంది: మంత్రి నారా లోకేశ్ ‘గత మహానాడులో మనం ఆరు శాసనాలను తీర్మానించుకున్నాం. అందులో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత. కార్యకర్తలను అందరూ గౌరవించాలి. ఆప్యాయంగా పలకరించాలి. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. రెండోది యువగళం. యువత రాజకీయాల్లోకి రావాలి. అన్ని కమిటీల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ ఎంతోమంది యువకులు, బాగా చదువుకున్న వారికి అవకాశం ఇచ్చి గెలిపించారు. వారు కూడా పార్టీకి అనేక సేవలు అందించారు. యువతను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉంది. మూడో శాసనం.. పేదల సేవలో- సామాజిక న్యాయం. ఈ రోజు మనం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పేదరికం లేని సమాజం కోసమే. తల్లికి వందనం, పెన్షన్, స్త్రీ శక్తి, దీపం పథకం, పీ-4 కార్యక్రమం.. ఇవన్నీ పేదరికం లేని సమాజం కోసమే చేస్తున్నాం. అన్ని పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. నాలుగోది స్త్రీ శక్తి. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలని తొలి అడుగు వేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. పార్టీ పదవుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలి. మహిళలను కించపరిచే పదాలను విడనాడాలి. పార్టీలో మహిళలను గౌరవించాలి. ఐదోది అన్నదాతకు అండగా. వారికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గతేడాది పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయడం జరిగింది. సప్లై-డిమాండ్ కు అనుగుణంగా ఏయే పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించడం జరుగుతోంది. దీంతో ఎప్పుడూ లేనివిధంగా మిరప ధర రికార్డు స్థాయిలో ఉంది. అన్నదాతకు కష్టం వస్తే మనం అండగా నిలవాలి. ఆరోది తెలుగుజాతి విశ్వఖ్యాతి. తెలుగుజాతి కోసం పుట్టిన పార్టీ టీడీపీ. ప్రపంచంలో ఏ రంగం చూసినా తెలుగువారు నెం.1గా ఉండే విధంగా మనం కృషిచేయాలి. అదే మన లక్ష్యం. పార్టీలో నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ ఆరు శాసనాలు పాటించాలి’అని మంత్రి నారా లోకేశ్ సూచించారు.