రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా

★ త్రివర్ణ పతాకావిష్కరణ

పయనించే సూర్యుడు న్యూస్ : దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. సైనికుల నుంచి 21 గన్ సెల్యూట్ స్వీకరించారు. వందేమాతరానికి 150 ఏళ్లు ప్రధాన ఇతివృత్తంతో కర్తవ్యపథ్‌లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలపై 4 ఎంఐ-17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. వారిలో ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఉన్నారు. ఈ వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు సైతం పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత రక్షణ దళాలు కవాతు నిర్వహించాయి. వివిధ విభాగాలకు చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో విన్యాసాలు చేపట్టారు. ఈ పరేడ్‌లో ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక బృందం కూడా పాల్గొంది. ఈ వేడుకల్లో 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శించారు. దేశ సైనిక శక్తిని, అభివృద్ధి పథాన్ని ప్రతిబింబించేలా ఈ పరేడ్ కొనసాగింది.ఈ వేడుకల్లో భాగంగా భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా‌కు అశోకచక్ర ప్రదానం చేశారు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో 30 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. 77వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీ ఢిల్లీలోని వార్ మెమోరియల్ వద్ద అమరజవాన్లకు నివాళులర్పించారు. అనంతరం కర్తవ్యపపథ్‌కు చేరుకున్నారు. మోదీ వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు. మరోవైపు రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. గుర్రపు బగ్గీలో ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌లతో కలిసి ప్రయాణించారు. కర్తవ్యపథ్‌కు చేరుకున్నవారికి ప్రధానమంత్రి మోదీ స్వాగతం పలికారు.