బండి సంజయ్, అరవింద్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

పయనించే సూర్యుడు న్యూస్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టంకలిగించే వ్యాఖ్యలు చేసినందుకుగానూ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఐదు రోజుల్లోగా ఎంపీలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా తనకు సిట్ నోటీసులు ఇచ్చిన సందర్భంలో తనపై విమర్శలు చేసిన వారికి లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు వేర్వేరుగా లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వ్యాఖ్యలు చేశారని...ఆ వ్యాఖ్యలను తాను తీవ్రంగా పరిగణిస్తూ లీగల్ నోటీసులు ఇచ్చారు.బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలకు కేటీఆర్ లీగల్ నోటీసులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ అరవింద్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. తన పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడారని ఆరోపిస్తూ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ప్రమేయంపై ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కేవలం దురుద్దేశ పూర్వకంగా, రాజకీయాల కోసం ఇద్దరు నేతలు దిగజారి ఆరోపణలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు.ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ గతంలో తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో లీగల్ నోటీసులు ఇచ్చానని దానిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుందని అన్నారు. అయినప్పటికీ మళ్లీ శుక్రవారం చట్ట వ్యతిరేకంగా తనపై అనవసరంగా నోరు పారేసుకున్నారు అని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్, అరవింద్‌లకు కేటీఆర్ తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు. బండి సంజయ్‌వి దురుద్దేశపూర్వకమైన ఆరోపణలు కేంద్రహోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు పంపిన నోటీసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్ న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న ప్రెస్ మీట్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ దురుద్దేశపూర్వకమైన ఆరోపణలు చేశారని...అవన్నీ అవాస్తవం అని చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్‌పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ, మళ్ళీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు ఆక్షేపనీయం మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్‌కు పంపిన నోటీసులో కేటీఆర్‌పై ఆయన చేసిన దూషణలను కేటీఆర్ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్‌పై ధర్మపురి అరవింద్ వ్యక్తిగత దూషణలు చేశారని మండిపడ్డారు.డ్రగ్స్ సేవించడం, మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్నారంటూ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు అక్షేపణీయమని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు. కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు కృషి చేసిన మాజీ మంత్రి అని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, అటువంటి వ్యక్తిపై ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేనని న్యాయవాదులు నోటీసుల్లో పేర్కొన్నారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఇద్దరు ఎంపీలు చేసిన తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అని కేటీఆర్ తరఫు న్యాయవాదులు కోరారు. కేటీఆర్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసులు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇరువురు నేతలకు హెచ్చరించారు.