డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అమెరికా నిష్క్రమణ

★ డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా టాటా-ప్రపంచానికే తీవ్రముప్పు అంటున్న డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్

పయనించే సూర్యుడు న్యూస్ : డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా పూర్తిస్థాయిలో గుడ్‌బై చెప్పేసింది. ఈ క్రమంలో సభ్యత్వాన్ని యూఎస్ ఉపసంహరించుకుంది. రెండేళ్లుగా సభ్యత్వ ఫీజును అమెరికా చెల్లించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో (డబ్ల్యూహెచ్‌ఓ) అమెరికా అధికారికంగా పూర్తిగా తెగతెంపులు చేసుకుంది. జనవరి 22తో ఈ ప్రక్రియ పూర్తయింది. 1948లో డబ్ల్యూహెచ్‌ఓ స్థాపించిన దగ్గర నుంచి అమెరికా తొలిసారి సభ్యత్వాన్ని కోల్పోయిన సంఘటన ఇదే. ఈ కీలక నిర్ణయానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి చేపట్టినప్పుడు తొలి రోజునే అంటే జనవరి 20,2025నే ఆ ఫైల్‌పై సంతకం చేశారు. నిబంధనల ప్రకారం నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం నోటీసు గడువు పూర్తవడంతో ఇప్పుడు ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. డబ్ల్యూహెచ్‌ఓపై ట్రంప్‌కు చాలా కాలంగా తీవ్ర అసంతృప్తి ఉంది. ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారిని సరిగ్గా ఎదుర్కోలేదని ఆయన ఆరోపించారు. చైనాలోని వుహాన్ నుంచి వైరస్ వ్యాప్తి జరిగిన సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ తగిన ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అంతేకాకుండా, సంస్థలో అవసరమైన సంస్కరణలు అమలు చేయడంలో విఫలమైందని, కొన్ని దేశాల రాజకీయ ప్రభావానికి లోనవుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఈ సంస్థపై చైనా ప్రభావం ఎక్కువగా ఉందని, డబ్ల్యూహెచ్‌ఓ పూర్తిగా చైనా పక్షపాతంగా పనిచేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేసి: అమెరికా పన్నుల రూపంలో వచ్చే డబ్బు డబ్ల్యూహెచ్‌ఓ ద్వారా వృథా అవుతోందని ట్రంప్ భావించారు. ఈ నేపథ్యంలోనే సంస్థకు అన్ని రకాల నిధులను నిలిపివేయాలని నిర్ణయించారు. డబ్ల్యూహెచ్‌ఓ మొత్తం బడ్జెట్‌లో అమెరికా వాటా సుమారు 20 శాతం ఉంటుంది. ఇప్పుడు ఆ నిధులు పూర్తిగా ఆగిపోవడంతో సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, డబ్ల్యూహెచ్‌ఓలో పనిచేస్తున్న అమెరికా సిబ్బంది, కాంట్రాక్టర్లను కూడా స్వదేశానికి పిలిపించారు. భవిష్యత్తులో డబ్ల్యూహెచ్‌ఓతో కలిసి పనిచేసే అవకాశం: డబ్ల్యూహెచ్‌ఓకు బదులుగా ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో నేరుగా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలని అమెరికా నిర్ణయించింది. ఆరోగ్య రంగంలో సహకారం కొనసాగుతుందని, అయితే అది డబ్ల్యూహెచ్‌ఓ ద్వారా కాకుండా వేరే మార్గాల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే కొన్ని పరిమిత అంశాల్లో మాత్రం భవిష్యత్తులో డబ్ల్యూహెచ్‌ఓతో కలిసి పనిచేసే అవకాశం ఉందని కూడా సంకేతాలు ఇచ్చారు. డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా బాకీ: 2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన సభ్యత్వ ఫీజును అమెరికా చెల్లించలేదు. దాంతో డబ్ల్యూహెచ్‌ఓకు సుమారు 278 మిలియన్ డాలర్లు బకాయిగా ఉన్నాయి. పూర్తి ఉపసంహరణకు ముందు ఈ బకాయిలు చెల్లించాలని డబ్ల్యూహెచ్‌ఓ కోరినా, అమెరికా వాటిని చెల్లించబోమని తేల్చి చెప్పింది. ప్రపంచ ఆరోగ్య భద్రతకు తీవ్ర నష్టం: ఈ నిర్ణయంపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేయేసస్ స్పందిస్తూ, ఇది అమెరికాకే కాకుండా ప్రపంచ ఆరోగ్య భద్రతకు కూడా నష్టం కలిగించే నిర్ణయమని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడంలో ఐక్యత అవసరమని ఆయన అన్నారు. అమెరికా వైదొలగడంతో ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావాలు ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.