టీ-హబ్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

★స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగించండి

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టీ-హబ్’కేవలం న్యూ ఇన్నోవేషన్స్, ప్రత్యేక స్టార్టప్‌లకు కేంద్రంగా మాత్రమే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సీఎస్‌ రామకృష్ణారావుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ నగరంలోని టీ-హబ్‌ను స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌ కు మారుస్తున్నారనే వార్తలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావుకు ఫోన్ చేసి ఈ అంశంపై చర్చించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు.ఇంక్యుబేటర్‌, ఇన్నోవేషన్‌, స్టార్టప్‌లకు కేంద్రంగానే టీ-హబ్‌ ఉండాలని స్పష్టమైన ఆదేశించారు. ఇతర ఆఫీసులు అక్కడ ఉండకూడదని...అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీ-హబ్‌ను ప్రభుత్వ ఆఫీసుల కోసం వాడకూడదు టీ-హబ్‌ లక్ష్యాన్ని నీరుగార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వార్తలు వచ్చాయి. దేశంలోనే ఆధునాతన ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్‌ క్యాటలిస్ట్‌గా నిలిచిన ఈ కేంద్రంలోకి అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను షిఫ్ట్ చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాతో జోరుగా సాగింది. అంతేకాదు ప్రధాన పత్రికల్లో సైతం కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్‌కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. టీ-హబ్‌ను ప్రభుత్వ ఆఫీసుల కోసం వాడకూడదని ఆయన సీఎస్ రామకృష్ణా రావుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రూ.1000 కోట్లతో స్టార్టప్ ఫండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటికే రూ.1000 కోట్ల స్టార్టప్ ఫండ్‌ను ప్రకటించింది. 2034 నాటికి హైదరాబాద్ నుంచి కనీసం 100 యూనికార్న్ కంపెనీలు రావాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోంది.