జగన్ హయాంలో రీసర్వే వల్ల భూ వివాదాలు

* మంత్రి కొండపల్లి వ్యాఖ్యలు.

జనం న్యూస్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన భూ రీ సర్వే అనేది రైతుల మేలు కోసం చేసింది కాదు అని అది కేవలం భూ కబ్జాలకు దారి వేసేందుకు వేసిన ఒక పక్కా వ్యూహం అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. డేటా ట్రాన్స్‌ఫర్ లో విఫలమై వెబ్లాండ్ వ్యవస్థను వైఎస్ జగన్ సర్వనాశనం చేశారని మంత్రి కొండపల్లి మండిపడ్డారు. ‘వైసీపీ అధినేత, మాజీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో చేపట్టిన భూ రీసర్వే అనేది రైతుల మేలు కోసం చేసిన సంస్కరణ కాదు…అది కేవలం భూకబ్జాలకు దారి వేసేందుకు వేసిన ఒక పక్కా వ్యూహం’అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ‘ఎన్టీఆర్ భవన్’లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ రీసర్వే అంశంపై జగన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవాలని చూడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థపై కనీస అవగాహన లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఈ ప్రయోగం వల్ల ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భూ యజమానులు, సామాన్య రైతులు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాను ఉదాహరణగా చూపిస్తూ, అక్కడ గత 18 నెలలుగా తాను వ్యక్తిగతంగా జరిపిన సమీక్షలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని మంత్రి తెలిపారు. జిల్లాలో ఉన్న మొత్తం రెవెన్యూ సమస్యల్లో 70 శాతం కేవలం జగన్ సర్కార్ అస్తవ్యస్తంగా నిర్వహించిన రీసర్వే వల్లే తలెత్తాయని వివరించారు. రూ.700 కోట్ల ప్రజాధనాన్ని తగలేసిన జగన్. బ్రిటిష్ కాలం నాటి పారదర్శక రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు స్పష్టంగా ఉన్నప్పటికీ.. అధికారులకు శిక్షణ ఇవ్వకుండా, తగిన సమయం కేటాయించకుండా బలవంతంగా రీసర్వేను రుద్దడం వల్ల వ్యవస్థ మొత్తం గందరగోళంలో పడిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. వలస వెళ్లిన రైతుల భూములను సైతం పట్టించుకోకుండా లక్షలాది జాయింట్ ఎల్పిఎం (LPM)లు సృష్టించి రైతుల ఆస్తులను చిక్కుల్లో నెట్టేశారని ధ్వజమెత్తారు.వెబ్లాండ్-1లో ఉన్న పూర్తి భూ చరిత్రను పట్టించుకోకుండా, హడావుడిగా వెబ్లాండ్-2కి మారడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *