
సాక్షి డిజిటల్ న్యూస్: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో అన్ని వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. కేంద్ర బడ్జెట్ 2026-27కు సమయం దగ్గర పడుతూ వస్తుంది. కేంద్ర బడ్జెట్ అనగానే అందులో ఏం ఉంటాయి. ఏఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయి. ఏ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేస్తారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్లో భారీ ఊరటలు ఏమైనా ఉన్నాయా అని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటూ ఉంటాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డును సృష్టించనున్నారు. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, రక్షణ రంగం, పన్ను చెల్లింపులు, ఐటీ రంగానికి కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని చర్చ జరుగుతోంది. 8వ పే కమిషన్, నిధులు సర్దుబాటు ఎలా : కేంద్ర బడ్జెట్ అనగానే కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆ బడ్జెట్ కేటాయింపుల్లో తమకు చదివింపులు ఉంటాయి ఏమోనని. అలాగే పెన్షన్లు కూడా ఆశగా ఎదురు చూస్తారు. అయితే ఈ బడ్జెట్లో 8వ పే కమిషన్ కీలకం కానుంది. 7వ పే కమిషన్ గడువు ముగియనుండటంతో, కొత్త కమిషన్ ఏర్పాటుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం ఆర్థిక మంత్రికి సవాలుగా మారనున్నాయి. వ్యయ నియంత్రణ ద్వారా ఈ నిధులను సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది. రక్షణ రంగానికి భారీ కేటాయింపులు : ప్రతీ ఏటా రక్షణ రంగానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేస్తున్నారు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ, జనాలు ప్రశాంతంగా ఉండాలంటే రక్షణ రంగంలో గట్టిగా ఉండాలి. అందుకే ఏటేటా నిధులను భారీగా పెంచుకుంటూ వెళుతున్నారు. అయితే ఈ బడ్డెట్లో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేటాయింపులు 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేటాయింపుల్లో ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత యుద్ధ యంత్రాలు, నౌకాదళ ఆధునీకరణ, వాయు సేనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. 7.4 శాతం వృద్ధి రేటు : ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ యుద్ధాలు వంటి వాటి మధ్య భారత్ 7.4 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళుతోంది. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నిర్మలా సీతారామన్ ఎలాంటి వరాలు కురిపిస్తారో ఫిబ్రవరి 1వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.