మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్‌కు తెలంగాణ గ్రీన్ సిగ్నల్

★వైద్య విద్యలో విప్లవాత్మక మార్పు ★అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్య

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వైద్యఆరోగ్యశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో వైద్య విద్యను సమూలంగా మార్చాలని నిర్ణయించింది.ఈ క్రమంలో 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సంప్రదాయ పద్ధతులతో పాటు అత్యాధునిక 'డిజిటల్ ఎడ్యుకేషన్' విధానాన్ని తక్షణమే అమలు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య బోధనను మెరుగుపరిచే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సంప్రదాయ విద్యా విధానంతో పాటు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన డిజిటల్ ఎడ్యుకేషన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైద్య విద్యలో సాంకేతికతను జోడించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యార్థులందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మెడికల్‌ ఎడ్యుకేషన్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. నాణ్యతలో రాజీ పడకూడదు ‘ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4,140 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో కాలేజీల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో విద్యా ప్రమాణాలపై ఎటువంటి రాజీలేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.’వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు. ‘ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చదివిన వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని, అదే స్థాయి బోధనను కొత్తగా ఏర్పాటైన జిల్లాల కాలేజీల్లోనూ అందించాలి. ఉస్మానియా విద్యార్థికైనా, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ విద్యార్థికైనా ఒకే రకమైన అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందాలి.’అని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ప్రాధాన్యత ‘మెడికోలకు కేవలం పుస్తక విజ్ఞానానికే పరిమితం చేయకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంపొందించాలి. ఇందుకోసం ప్రతి మెడికల్ కాలేజీలో ప్రాథమిక స్థాయి నుంచే డిజిటల్ మౌళిక వసతులను కల్పించాలి. తరగతి గదుల్లో స్మార్ట్ బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్లు, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పరీక్షించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకోవాలి.’అని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీలు ‘నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పాఠ్యాంశాలను డిజిటల్ రూపంలోకి మార్చి, నేషనల్ డిజిటల్ లైబ్రరీతో అనుసంధానం చేయాలి. బోధనాసుపత్రుల్లోని రద్దీ దృష్ట్యా, విద్యార్థులకు క్లినికల్ కేస్ స్టడీలను వివరించేందుకు టెలీమెడిసిన్ విధానాన్ని వినియోగించుకోవాలి.