నితిన్ నబీన్ నా బాస్… నేను కార్యకర్తను

*ప్రధాని మోదీ

సాక్షి డిజిటల్ న్యూస్: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ మంగళవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ మంగళవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పార్టీలో జరిగిన సంస్థాగత ఎన్నికల్లో నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. దీంతో ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా స్థానంలోకి ఆయన వచ్చారు. బీజేపీకి 12వ అధ్యక్షుడిగా నిలిచారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కొత్త అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… నితిన్ నబీన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. నితిన్ నబిన్‌ను “మిలీనియల్”గా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఆయన భారతదేశంలో ఎన్నో మార్పులను చూసిన తరానికి చెందినవారని పేర్కొన్నారు. పార్టీ విషయానికి వస్తే, నితిన్ నబీన్ తన బాస్ అని… పార్టీలో తాను కార్యకర్తను మాత్రమేనని చెప్పారు. ‘‘రాబోయే 25 సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలోనే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాల్సి ఉంది… అది జరగడం ఖాయం. ఈ కీలకమైన కాలం ప్రారంభంలో మన నితిన్ నబిన్ జీ బీజేపీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తారు. నేటి యువత భాషలో చెప్పాలంటే… నితిన్ జీ స్వయంగా ఒక విధంగా మిలీనియల్. ఆయన భారతదేశంలో ప్రధాన ఆర్థిక, సామాజిక, సాంకేతిక పరివర్తనలను చూసిన తరానికి చెందినవారు’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘ఆయన చిన్నతనంలో రేడియో నుంచి సమాచారాన్ని పొందిన తరానికి చెందినవారు… ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాక్టివ్ యూజర్‌గా ఉన్నారు. నితిన్ జీలో యువశక్తి, సంస్థాగత పనిలో విస్తృతమైన అనుభవం రెండూ ఉన్నాయి. ఇది మన పార్టీలోని ప్రతి కార్యకర్తకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది…’’అని ప్రధాని మోదీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *