
పయనించే సూర్యుడు న్యూస్ : WEF-2026 దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి బృందం గూగుల్, యూనిలీవర్, ఫిలిప్స్, UAE, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF-2026) సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తొలిరోజే సత్తా చాటింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థల అధినేతలు, వివిధ దేశాల మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. "తెలంగాణ రైజింగ్" నినాదంతో సాగుతున్న ఈ పర్యటనలో మొదటి రోజే పలు కీలక ఒప్పందాలకు పునాది పడింది. గూగుల్, యూనిలీవర్, ఫిలిప్స్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ టెక్, స్కిల్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి కీలక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు, సాంకేతిక సహకారం అందించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలువురు అధికారులతో కూడిన బృందం బిజీబిజీగా గడిపింది. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీతో కీలక భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యవసాయం, వాతావరణ మార్పుల రంగాల్లో ఇన్నోవేషన్ స్టార్టప్‌లకు సహకారం అందించడంపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌టెక్, హెల్త్ టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. త్వరలో ఇజ్రాయెల్ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణలో పైలట్ ప్రోగ్రామ్‌లు ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది.ఫ్యూచర్ సిటీకి యూఏఈ బాసట హైదరాబాద్ శివార్లలో తలపెట్టిన 'భారత్ ఫ్యూచర్ సిటీ' నిర్మాణానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం తమ సహకారం అందిస్తుందని ఆ దేశ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో ఏఐ, విద్య, ఆరోగ్యం వంటి జోన్ల ఏర్పాటుపై సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఇరు ప్రభుత్వాల అధికారులతో సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్కిల్ యూనివర్సిటీలో సౌదీ 'ఎక్స్పర్టైజ్' భాగస్వామ్యం సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘ఎక్స్పర్టైజ్’ తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపింది. ఆ సంస్థ సీఈఓ మొహమ్మద్ ఆశిఫ్ సీఎంతో భేటీ అయ్యారు. ఏటా తమకు అవసరమైన 5 వేల మంది నిపుణులను స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఎంపిక చేసుకునేందుకు, వారికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. పెట్రో కెమికల్స్, ఆయిల్, గ్యాస్ రంగాల్లో అవసరమైన శిక్షణను అందించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ఏఐ, హెల్త్ టెక్‌లో ఫిలిప్స్ ఆసక్తి ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ తెలంగాణలో ఏఐ ఆధారిత ఆరోగ్య సేవల విస్తరణకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో 'నాలెడ్జ్ హబ్' ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ జాన్ విల్లెమ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏఐ సిటీని నిర్మిస్తున్నామని, నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని మంత్రి శ్రీధర్ బాబు వారిని కోరారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీని ఫిలిప్స్ బృందం ప్రశంసించింది. గూగుల్ గ్లోబల్ ప్రెసిడెంట్‌తో చర్చలు గూగుల్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం, వాతావరణ మార్పుల వంటి అంశాల్లో తెలంగాణ ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందించేందుకు గూగుల్ అంగీకరించింది. కోర్ సిటీని కాలుష్య రహితంగా మార్చేందుకు, రైతుల సమస్యల పరిష్కారానికి గూగుల్ టెక్నాలజీని ఉపయోగించుకోనున్నారు. హైదరాబాద్‌లో యూనిలీవర్ జీసీసీ? కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం యూనిలీవర్ సంస్థ హైదరాబాద్‌లో తమ 'గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్' (GCC) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆ సంస్థ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో జరిగిన భేటీలో సీఎం రేవంత్ ఈ ప్రతిపాదన ఉంచారు. హైదరాబాద్ ఇప్పటికే మెక్‌డొనాల్డ్స్, పెప్సీకో వంటి సంస్థల జీసీసీలకు కేంద్రంగా ఉందని, యూనిలీవర్ రాకకు అన్ని రకాల అనుమతులు వేగంగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిపై సంస్థ సానుకూలంగా స్పందించింది.