
పయనించే సూర్యుడు న్యూస్ : లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు కనబరుస్తుంది. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ అధికారులు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నవారికి సమస్లు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసి జనవరి 22న తమ ముందు విచారణకు హాజరుకావాలని కోరారు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జనవరి 23న తమ ముందు హాజరు కావాలని మిథున్ రెడ్డికి జారీ చేసిన నోటీసులలో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇక, ఇదే కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 70 రోజుల పాటు జైలులో ఉన్న మిథున్ రెడ్డి 2025 సెప్టెంబర్ 29న బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 3,500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. మద్యం వ్యాపారుల నుంచి భారీ స్థాయిలో కమీషన్లు దండుకుని, ఆ సొమ్ము అక్రమ మార్గంలో విదేశాలకు మళ్లింపు చేపట్టినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి విచారణ కోసం ఏపీ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. ఈ కేసులో సిట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్నారు. మిథున్ రెడ్డిని ఈ కేసులో ఏ4గా చేర్చారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు మూడు చార్జిషీట్లను దాఖలు చేశారు. కొత్త మద్యం విధానానికి సంబంధించి 2019 జూలైలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక సమావేశానికి అధ్యక్షత వహించారని పోలీసులు తెలిపారు. ఈ విధానం ప్రకారం మద్యం విక్రయించే దుకాణాలను ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) నడుపుతుందని... ముడుపులను ఆఫీస్ బాయ్స్ వంటి సాధారణ వ్యక్తుల ఖాతాల ద్వారా మళ్లించి, వ్యవస్థీకృత పద్ధతిలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని కూడా చార్జిషీట్లలో ఆరోపించారు. ఈ కేసులో పలువురిని అరెస్ట్ కూడా చేశారు. అరెస్టు అయిన వారిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. కొన్ని రోజులు రాజమండ్రి జైలులో ఉన్న మిథున్ రెడ్డి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ కోణం ఏమైనా ఉందా? అని తెలుసుకోవడానికి ఈడీ కూడా రంగంలోకి దిగింది. సిట్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని, ఆరోపించిన కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి 2025 సెప్టెంబర్‌లో పీఎంఎల్ఏ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డితో సంబంధించిన పలుచోట్ల ఈడీ అధికారులు గతేడాదిసెప్టెంబరులో సోదాలు చేపట్టి ఆర్థిక లావాదేవీలు పరిశీలించారు. తర్వాత రాజ్ కెసిరెడ్డిని ప్రశ్నించి వివరాలు సేకరించారు.