
పయనించే సూర్యుడు న్యూస్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటనకు విచ్చేశారు. ఆయనకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటనకు విచ్చేశారు. ఆయనకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని మోదీ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‌కు స్వాగతం పలికారు. ఇది భారత్ - యూఏఈ దేశాల స్నేహానికి ప్రధాని మోదీ ఇచ్చే ప్రాముఖ్యతను ప్రతిబింబించింది. ఎయిర్‌పోర్టులో అల్ నహ్యాన్‌కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ ఆయనతో కరచాలనం చేశారు. తర్వాత ఇరువురు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ కలిసి ఒకే కారులో అక్కడి నుంచి బయలుదేరారు. ఇరువురు నేతలు కారులో కూర్చుని ఒకరినొకరు పలకరించుకుంటున్న ఫోటోను ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘‘మా చర్చల కోసం ఎదురు చూస్తున్నాను. నా సోదరుడు, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్ళాను. అల్ నహ్యాన్ పర్యటన బలమైన భారతదేశం - యూఏఈ స్నేహానికి ఆయన ఇచ్చే ప్రాముఖ్యతను వివరిస్తుంది. మా చర్చ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) విడుదల చేసిన ఆయన షెడ్యూల్ ప్రకారం... అల్ నహ్యాన్ రెండు గంటల కంటే తక్కువ సమయం భారత రాజధాని ఢిల్లీలో ఉండనున్నారు. ఇరాన్-అమెరికా సంబంధాలలో తీవ్ర క్షీణత సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య యెమెన్ విషయంలో ఉద్రిక్తతలు గాజాలో అశాంతికరమైన రాజకీయ పరిస్థితి కారణంగా మధ్యప్రాచ్యంలో అస్థిర పరిస్థితి వంటి పరిస్థితుల నేపథ్యంలో అల్ నహ్యాన్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో అల్ నహ్యాన్, ప్రధాని మోదీలు పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. యూఏఈ అధ్యక్ష హోదాలో అల్ నహ్యాన్ భారత్‌లో అధికారికంగా పర్యటించడం ఇది మూడోసారి. 2022లో భారత్, యూఏఈల మధ్య ప్రతిష్టాత్మకమైన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత ద్వైపాక్షిక వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలలో గణనీయమైన పెరుగుదల ఉంది. అయితే అల్ నహ్యాన్ తాజా పర్యటనలో ప్రధాని మోదీతో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ పరిశ్రమ సహకారం, ఇంధన కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యంలో పరిస్థితి కూడా చర్చలలో ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.